సభ్య సమాజానికి “సందేశాల మీట్”

Allu Arjun Harish Shankar Dil Raju fires on web reviews and social mediaతొలి రోజు వెలువడిన భారీ నెగటివ్ టాక్ వ్యక్తమైన తర్వాత కూడా మొదటి నాలుగు రోజుల్లో 75 కోట్ల గ్రాస్ వసూలు చేసిందన్న సంతోషంతో “దువ్వాడ జగన్నాధమ్” చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘థ్యాంక్యూ మీట్’లో చిత్ర హీరో అల్లు అర్జున్ మొదలుకుని, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజులు కలిసి ఏకధాటిగా సోషల్ మీడియా అండ్ వెబ్ రివ్యూలను టార్గెట్ చేసుకుంటూ వ్యాఖ్యానించారు. ఒక్క మాటలో చెప్పాలంటే… ఈ ‘థ్యాంక్యూ మీట్’ని హరీష్, దిల్ రాజు, అల్లు అర్జున్ ల స్పీచ్ “సభ్య సమాజానికి సందేశం ఇచ్చే మీట్”గా మార్చేసారు.

ADVERTISEMENT

మొదటి వారంలోనే 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తుందని చెప్పిన నిర్మాత దిల్ రాజు, ఇతర హీరోల అభిమానులకు ఓ సందేశం ఇచ్చారు. సోషల్ మీడియాలో మన హీరోలను మనమే తక్కువ చేసుకునే సంస్కృతికి దిగజారవద్దని, నిజానికి ‘బాహుబలి, దువ్వాడ జగన్నాధమ్’ వంటి మన తెలుగు సినిమాల స్థాయిని చూసి ముంబై వారు మాట్లాడుకుంటున్నారని, అలాంటి తరుణంలో అభిమానులు ప్రవర్తించాల్సిన విధానం ఇది కాదని, ఇప్పుడు ‘డీజే’ సాధిస్తున్న కలెక్షన్స్ ను మరో పెద్ద సినిమా దాటాలని కోరుకోవాలని, అలా అలా తెలుగు సినిమా స్థాయి పెరగాలని అభిమానులు కోరుకోవాలని దిల్ రాజు పిలుపునిచ్చారు.

ఇక మైక్ పట్టుకోగానే తాను కాస్త ఎక్కువ మాట్లాడతాను అంటూ మొదలుపెట్టిన హరీష్ శంకర్, చివరికి నేను ముందే చెప్పానుగా ఎక్కువ మాట్లాడతాను అంటూ ముగించారు. రివ్యూలు రాసే వాళ్ళని నేరుగా టార్గెట్ చేసిన హరీష్ శంకర్, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వైరం బాగా పెరిగిపోతోందని, ఇలా అయితే సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అంటూ ప్రశ్నించారు. ఇక సోషల్ మీడియాలో చర్చగా జరుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ తో బన్నీ యాక్టింగ్ ను పోల్చడాన్ని సరైనది కాదంటూ… చాలా మంది హీరోలు ఫ్యాక్షన్ క్యారెక్టర్లు వేసారు, చాలా మంది పోలీస్ క్యారెక్టర్లు చేసారు, ఎవరి స్టైల్ వారిదే అన్న సిద్ధాంతాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు.

తన డైలాగ్స్ విషయంలో వస్తున్న విమర్శలను టార్గెట్ చేస్తూ… తాను అన్ని రకాల డైలాగ్స్ లను రాస్తున్నానని అయితే మాస్ డైలాగ్స్ మాత్రమే జనాలు గుర్తుంచుకుంటున్నారని, తను దర్శకత్వం వహించిన వివిధ సినిమాల్లోని డైలాగ్స్ ను వివరించారు. ఆ తర్వాత ఇంకాస్త ఏమోషనల్ అయిన హరీష్, ‘గబ్బర్ సింగ్ వలన తనకు యాటిట్యూడ్ రాలేదని, తన యాటిట్యూడ్ వలనే గబ్బర్ సింగ్’ వచ్చిందని వ్యాఖ్యానించారు. సినిమా బాగోకపోతే విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, అయితే అది సరైన ధోరణిలో ఉండాలే తప్ప, ఈ దర్శకుడికి కళ్ళు నెత్తికెక్కాయి, ఇతనికి విపరీతమైన పొగరు… అని రాయడం తప్పని ఎత్తిచూపిస్తూ… చివరగా రివ్యూలను పట్టించుకోకుండా ఎవరికి వాళ్ళు సినిమాను చూడాలని సభ్య సమాజానికి సందేశం ఇచ్చారు.

ఇక చివరగా మాట్లాడిన అల్లు అర్జున్… ఇప్పుడు అరవండి డీజే… డీజే… అంటూ ఫ్యాన్స్ ను ఉత్సాహాపరిచారు. ఈ వేడుకలో పాల్గొన్న అభిమానులంతా చక్కగా వ్యవహరించి సభ్య సమాజానికి మంచి సందేశం ఇచ్చారని, ఈ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా అయితే మన కంటే సినిమా ఎక్కువ మాట్లాడుతుంది, కానీ మీరిచ్చిన స్పీచ్ సినిమా కంటే ఎక్కువ మాట్లాడిందని అనుకుంటున్నాను… అంటూ హరీష్ శంకర్ ను ఉద్దేశించి ఓ పంచ్ వేసాడు బన్నీ. ఈ సినిమాపై కొంత నెగటివిటీ ఉన్న విషయం తెలుసని, అయితే దానిని తన పాజిటివిటీతో అధిగమించేలా చూస్తానని, ప్రపంచంలో ఎక్కువ మంది మంచోళ్ళు ఉన్నారని ఈ సందర్భంగా రుజువైందని అల్లు అర్జున్ తెలిపారు.

మరి ఆ తక్కువ మంది చెడ్డోళ్ళు ఎవరని మాత్రం అడగకండి..! ఇట్స్ సీక్రెట్..!

ADVERTISEMENT
Latest Stories