ఇండియన్ సినీ మార్కెట్ లో ‘బాహుబలి’ సినిమా అనేది ఒక బెంచ్ మార్క్. ముఖ్యంగా తెలుగు సినిమా ఖ్యాతిని ఎక్కడో ఎవరెస్ట్ లో నిల్చోబెట్టింది. దీంతో ఈ సినిమా రికార్డులను తాకాలని ఊవ్విళ్ళూరుతున్న సినిమాలకు చెందిన వారంతా, ఆ సినిమాతో లింక్ పెడుతూ కామెంట్స్ చేస్తుండడం విస్మయానికి గురి చేసే అంశం. గతేడాది దసరాకు విడుదలైన ‘స్పైడర్’ సినిమా విడుదల సమయంలో… ‘బాహుబలి’ స్థాయిలో విజువల్ గ్రాఫిక్స్ ఉంటాయని, ఆ సినిమా స్థాయిలో తెలుగు సినిమా ఘనకీర్తిని పొందుతుందని కామెంట్స్ చేసారు.
తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి చూస్తే… ‘బాహుబలి’ పక్కన పెడితే, కనీసం ఉన్నత స్థాయిలో కూడా ‘స్పైడర్’ గ్రాఫిక్స్ లేవన్నది తెలిసిన విషయం. తాజాగా “నా పేరు సూర్య” నిర్మాత లగడపాటి శ్రీధర్ కూడా తమ సినిమా ‘బాహుబలి’ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతుందని ప్రకటనలు ఇస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఇలాంటి పబ్లిసిటీలు చెయడం, దీంతో అంచనాలు పెరగడం, ఆ తర్వాత చతికిలపడడం రొటీన్ గా జరుగుతున్న విషయం. ‘బాహుబలి’తో పోల్చకుండా వీరంతా తమ సినిమాలకు పబ్లిసిటీ ఇచ్చుకోలేరేమో!
తాము నిర్మించిన సినిమాపై నమ్మకం ఉండడంలో తప్పులేదు గానీ, మరీ ఓవర్ డైలాగ్స్ వేస్తే అది రివర్స్ అయ్యే ప్రమాదం ఉందన్న విషయం కూడా సదరు ప్రకటనలు చేసేవారు గుర్తించాలి. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 27వ తేదీగా మరోసారి ఖరారు చేసారు లగడపాటి శ్రీధర్. మార్చి నాటికల్లా ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని, అనుకున్న సమయానికి విడుదల చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఇప్పటికే 70శాతం సినిమా పూర్తయ్యిందని, మరో 40 రోజుల్లో సినిమా మొత్తం పూర్తవుతుందని స్పష్టత ఇచ్చారు.



