“పుష్ప” ఈవెంట్ – పస లేదు!

Allu-Arjun-Pushpa-Pre-release eventఅల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో అట్టహాసంగా అశేష అభిమానుల నడుమ ఆదివారం నాడు జరిగింది. విడుదలకు అయిదు రోజుల ముందు నిర్వహించిన ఈ ఈవెంట్ ప్రేక్షకులలో గానీ, అభిమానుల్లో గానీ ఆశించిన రీతిలో బజ్ ను క్రియేట్ చేయలేదన్నది లేటెస్ట్ టాక్.

ప్రేక్షకులు, అభిమానులు విపరీత సంఖ్యలో తరలి వచ్చారు గానీ, వారిని ఆకట్టుకునే విధంగా ఏ ఒక్కరి స్పీచ్ కూడా లేకపోవడంతో ఈవెంట్ కాస్త నిరుత్సాహంగానే ముగిసింది. ఎప్పుడూ జోష్ గా కనిపించే అల్లు అర్జున్ కూడా నీరసించి మాట్లాడడం విశేషం. బహుశా దర్శకుడు సుకుమార్ లేని లోటు బన్నీలో స్పష్టంగా కనపడింది.

ADVERTISEMENT

ఇక హీరోయిన్ రష్మిక మరియు కీలక పాత్ర పోషించిన అనసూయల స్పీచ్ లు అభిమానుల సహనానికి పరీక్షలు పెట్టాయి. ఎంతో చెప్పాలని స్టేజి మీదకు విచ్చేసి, అత్యుత్సాహంలో ఇంకేదో చెప్పేసి వెళ్లారన్న టాక్ ను వీరిద్దరూ సొంతం చేసుకున్నారు. అల్లు అరవింద్ గారి స్పీచ్ ని అయితే ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో ప్రకాష్ రాజ్ స్పీచ్ తో పోలుస్తూ నెటిజన్లు ట్రోల్ చేసుకున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కున్న ప్రాముఖ్యత ఏమిటో ఇటీవల “అఖండ” చాటి చెప్పింది. ట్రైలర్ తో ఏర్పడిన భారీగా పెరిగిన అంచనాలను ప్రీ రిలీజ్ ఈవెంట్ మరో ఎత్తుకు తీసుకెళ్లింది. దీంతో అభిమానుల్లో నూతన ఉత్సాహం ఉరకలేసింది. సరిగ్గా “పుష్ప” విషయంలో ఇదే మిస్ అవుతోంది. పస లేని ప్లానింగ్ కొట్టొచ్చినట్లు కనపడుతోంది.

పబ్లిసిటీ పరంగా చిత్ర యూనిట్ కావాల్సిన బజ్ ను క్రియేట్ చేయలేకపోయినప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ లో ఏ మాత్రం “పుష్ప” తగ్గడం లేదు. అయితే రాజమౌళి చెప్పినట్లుగా దీనిని ‘గ్రాంటెడ్’గా తీసుకుంటే మాత్రం, చిత్ర యూనిట్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న హెచ్చరికలు కోకొల్లలు. గతంలో సుకుమార్ “1 నేనొక్కడినే” విషయంలో కూడా ఇలానే జరిగిందన్న విషయాన్ని గుర్తుకు తెస్తున్నారు.

‘1 నేనొక్కడినే’ సినిమాకు మరి కాస్త సమయం తనకు లభిస్తే, ప్రేక్షకులు మెచ్చేలా సినిమాను అందించే వాడినని, ఆ సినిమా ఫలితం వెలువడిన తర్వాత సుకుమార్ స్వయంగా పలు సార్లు చెప్పారు. సంక్రాంతి సమయానికి అప్పుడు సుకుమార్ పడ్డ హడావుడి, మళ్ళీ “పుష్ప” విషయంలో పునరావృతం అవుతుండడం అభిమానులకు ఆందోళనకరంగా మారింది. అయితే ఈ సారి ఫలితం మాత్రం వేరుగా ఉండాలని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories