అమరావతిని కాపాడేవారెవరూ?

Amaravati Lands Distributing For Poor Peopleగత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు స్థానిక రైతులు ప్రభుత్వం మీద నమ్మకంతో తమ జీవనోపాధిగా ఉన్న పంటభూములను ప్రభుత్వానికి అప్పగించారు. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే. రైతులు తమ భూములను, దాంతోపాటే జీవనోపాధి కోల్పోయారు.

ADVERTISEMENT

ప్రభుత్వం వారిమీద కమ్మ, టిడిపి ముద్రలు వేసి వెలివేసింది. అమరావతిని కాపాడుకోవాలనే ఆరాటంతో పోరాటం చేస్తున్నందుకు వైసీపీ నేతల, పోలీసుల వేధింపులు, అక్రమకేసులు, మరోపక్క ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దురదృష్టమేమిటంటే, వారు రాష్ట్రం కోసం ఇన్ని త్యాగాలు చేసి ప్రభుత్వంతో, సమస్యలతో పోరాడుతున్నా రాజకీయ పార్టీలు మొక్కుబడిగా సంఘీభావం ప్రకటించివెళ్ళిపోతున్నాయే వారికి అండగా నిలబడటం లేదు!

ఇక రాష్ట్ర ప్రజలు కూడా వారేదో తమ భూముల కోసం, భుక్తి కోసమే ఉద్యమాలు చేసుకొంటున్నారన్నట్లు నిర్లిప్తంగా ఉండిపోవడంతో నిజంగానే అమరావతి రైతులు ఒంటరివారైపోయారు. అయినా ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు.

అమరావతి నిర్మాణం కోసం ఇచ్చిన భూములను రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్లు వేసి పేదలకు పంచిపెట్టేస్తోంది. తద్వారా భవిష్యత్‌లో వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమరావతిని నిర్మించేందుకు అక్కడ సెంటు భూమి కూడా లేకుండా చేస్తోందని ఆరోపిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి కొలికిపూడి శ్రీనివాస్ నేటి నుంచి అబ్బురాజుపాలెంలోని డా.అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆమరణ నిరారాహార దీక్ష చేసేందుకు సిద్దపడగా, దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకుపోయారు. ఆయనను హైదరాబాద్‌ తరలించిన్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ పోలీసులు వాటిని ధృవీకరించడం లేదు. ఖండించడం లేదు. ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదు!

అమరావతిలో ఆర్‌-5 జోన్ ఇళ్ళ స్థలాల కోసమే ఏర్పాటు చేస్తున్నామని జగన్ ప్రభుత్వం చెప్పుకొంటున్నప్పటికీ, వాటిని వైసీపీలో అస్మదీయులకు కట్టబెట్టేసేందుకు కుట్ర చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపిస్తున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ విచ్ఛిన్నం చేసేందుకు సృష్టించిన ఆర్‌-5 జోన్‌లోని ఎస్-3 భూముల ఖరీదు ఎకరం రూ.4.31 కోట్లు పలుకుతుండగా జగన్ ప్రభుత్వం దానిని తమ నేతలకు కారుచవుకగా ఎకరం రూ.24.60 లక్షలకే కట్టబెట్టేస్తోందని దేవినేని ఉమా ఆరోపించారు.

ఇప్పటికే అక్కడ 1,134 ఎకరాలు చేతులు మారాయని, దీనిపై సుప్రీంకోర్టు విచారిస్తుండగానే మరో 268 ఎకరాలకు రెక్కలు వచ్చేశాయని దేవినేని ఉమా ఆరోపించారు. అమరావతి బృహత్ ప్రణాళిక సర్వనాశనం చేసే దిశగా అడుగులు. నాలుగేళ్లుగా కౌలే ఇవ్వలేదు. రాజధానిలో కట్టిన టిడ్కో ఇళ్ళకు తికాణం లేదు. అమరావతి విధ్వంసానికి రాజకీయకుట్ర కార్యక్రమాలు చేస్తున్నారని దేవినేని ట్వీట్‌ చేశారు.

ఇందుకేనా… అమరావతి రైతులు తమ పంట భూములను త్యాగం చేసింది?వారికి ఎలాగూ ప్రభుత్వం నుంచి గౌరవమర్యాదలు దక్కడం లేదు. ప్రభుత్వానికి రాజధాని నిర్మించే ఆలోచన లేనప్పుడు కనీసం వారి భూములు వారికి తిరిగి ఇచ్చేయాలి కదా?కానీ ఎందుకు ఇవ్వడం లేదు? వాటిని అప్పనంగా ఎందుకు పంచిపెట్టేస్తోంది?అనే ప్రశ్నకు సమాధానం లభించదు. అమరావతి విచ్ఛిన్నమైపోతున్నా పట్టించుకొనేవాడులేడు… ఆ భూములను కాపాడే నాధుడూ లేడు!

ADVERTISEMENT
Latest Stories