రాష్ట్రంలో జరిగే ప్రోజెక్టుల మీద స్పందించాడనికి ఎన్నడూ మీడియా ముందుకు రాని వైసీపీ మంత్రులు ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాల మీద స్పందించడానికి క్షణ కాలం కూడా వేచి ఉండలేరని మరోసారి నిరూపించుకున్నారు నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార, ప్రతిపక్షాలు వారి వారి వ్యూహాలను ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుంటున్నారు. అధికార వైసీపీ ఇంచార్జ్ ల మార్పుతో ముందుకెళ్తుంటే, ప్రతిపక్ష పార్టీలైన జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా ఉంది. అటు టీడీపీ రాబోయే ఎన్నికలలో గెలుపు వ్యూహాలను సిద్ధంచేయడానికి ప్రశాంత్ కిషోర్ తో చర్చలు జరుపుతూ తన పని తానూ చేసుకుంటూ పోతుంది.
అయితే ప్రశాంత్ కిషోర్ – బాబు చర్చలు మొదలుపెట్టారు అనే వార్త వచ్చి రాగానే అంబటి “మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేయగలడు” అంటూ తన సామజిక మాధ్యమాలలో విమర్శల వేడి రాజేశారు. అక్కడితో ఆగకుండా మీడియా ముందుకు వచ్చి మరీ గతం, వర్తమానం అంటూ మొదలుపెట్టారు. ఆ పీకే, ఈ పీకే టీడీపీ పార్టీని బతికించలేరని, కేవలం పోస్ట్ మార్టం చేయడానికే పనికొస్తారంటూ వ్యాఖ్యానించారు.
“మెటీరియల్ లో నాణ్యత ఉన్నా మేస్త్రి లో నైపుణ్యం లేకపోతే కూడా ఏం చేయలేమనే” విషయం మంత్రి అంబటి గారికి తెలియనట్టుంది. సమర్ధవంతమైన అధికారులు, నైపుణ్యం ఉన్నా ఇంజనీర్లు ఉన్నప్పటికీ పూర్తి చేయాలనే ఆసక్తి లేని మంత్రులు అంబటి గారి భాషలో చెప్పాలంటే మేస్త్రి ఉన్నప్పుడు ప్రాజెక్టులు ఎలా పూర్తి కావనేది ఇప్పుడు ఏపీ ప్రజలకు అర్ధమయ్యింది మంత్రి గారు అంటూ అంబటి చురకలు అంటిస్తున్నారు నెటిజన్లు.
అలాగే పెద్ద మొత్తంలో (151) వైసీపీ ప్రభుత్వంలో మెటీరియల్ ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వ మేస్త్రి దగ్గర నైపుణ్యం లేకపోవడం కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రాలేకపోయిందా?పోలవరం పూర్తి కాలేకపోయిందా?ఏపీకి రాజధాని నిర్ణయం జరగలేకపోతుందా?రాష్ట్రంలో మధ్య నిషేధం అమలు కాలేకపోతుందా? అంటూ అంబటి మీద ప్రశ్నల వర్షమే కురవబోతుంది.
2014 ఎన్నికలలో ఒక పీకే కారణంగా అధికార పీఠానికి దూరమైనా వైసీపీ, 2019 ఎన్నికలలో మరో పీకే సహాయంతో అధికార పీఠం దక్కించుకున్న విషయం అంబటి మరిచినట్టున్నారు. వైసీపీ పార్టీకి ఆ ఇద్దరి పీకే ల బలం బాగా తెలుసు కాబట్టే మెటీరియల్, మేస్త్రి అంటూ అర్ధం పర్థం లేని విమర్శలకు దిగుతున్నారు అంటూ అంబటి వ్యాఖ్యలను తోసిపుచ్చుతున్నారు టీడీపీ శ్రేణులు.
ఒక వస్తువు ఎవరినైనా మెప్పించాలి అంటే మెటీరియల్, మేస్త్రి రెండిటిలో నాణ్యత ఉండాలి. లేకపోతే కనీసం నాణ్యత ఉంది అనేలా ప్రజలను నమ్మించగలగాలి. అదే వస్తువుని వద్దనుకోవడానికి మాత్రం మెటీరియల్ లో కానీ మేస్త్రీలో కానీ ఏఒక్కదానిలో నాణ్యత లేకపోయినా దానిని ప్రజలు పక్కన పడేస్తారు అనేది అంబటి గ్రహించాలని మంత్రి గారి శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.




