నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది. ప్రభుత్వం మారినా ఆరు నెలలుగా కాకినాడ పోర్టు నుంచి లక్షల టన్నుల రేషన్ బియ్యం యధేచ్చగా విదేశాలకు తరలిపోతూనే ఉంది. రాష్ట్రంలో నేటికీ ఎక్కడో అక్కడ గంజాయి పట్టుబడుతూనే ఉంది. రాష్ట్రంలో బెల్ట్ షాపులు నడుస్తూనే ఉన్నాయి.
మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు పరిస్థితి అలాగే ఉంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఇంకా తేలనేలేదు. ఈలోగా రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు వ్యవహారాలు బయటపడ్డాయి. కనుక కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యంపై మరో ‘సిట్’ వేసింది.
మాజీ మంత్రి అంబటి రాంబాబు తొలిసారిగా చాలా సహేతుకంగానే మాట్లాడారు. “అనితా వంగలపూడి తాను హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోగా రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికారు. కానీ ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా రాష్ట్రంలో ఎక్కడో అక్కడ గంజాయి పట్టుబడుతూనే ఉంది కదా?దీనికి మీ సమాధానం ఏమిటి?” అని ప్రశ్నించారు.
గంజాయిని అరికట్టడం కోసం ‘ఈగల్ టీమ్స్’ ఏర్పాటుపై స్పందిస్తూ ‘గంజాయి మీద ఈగలు వాలుతున్నాయని’ ని ఆయన ఎద్దేవా చేశారు. గంజాయి అరికట్టలేక ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ, “తిరుమల లడ్డూ కోసం ఓ సిట్టూ, రేషన్ బియ్యం కోసం మరో సిట్టూ.. ఇలా ఎన్ని సిట్టులు ఏర్పాటు చేస్తారు? ఈ సిట్టులన్నీ ఈనాడు పేపరులో పెద్ద అక్షరాలతో బ్యానర్ ఐటెమ్ వార్తలు వేసుకోవడానికే. సిట్టూ, స్టాండూ అంటూ హడావుడి చేయడం తప్ప ఈ ప్రభుత్వం మరేదీ చాతకాదు,” అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు, భూకబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలపై ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోకుండా మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని టీడీపీ శ్రేయోభిలాషులు అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు.
సిట్టు, స్టాండూ అంటూ హడావుడి చేయడమే తప్ప కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. ఆయన చెప్పిననట్లు కూటమి ప్రభుత్వం సిట్టు, స్టాండూ కాలక్షేపం చేస్తూనే ఉంటుందా? ఎప్పటికైనా (వైసీపీ) అక్రమార్కులపై చర్యలు తీసుకుంటుందా?అని వైసీపీకి చెందిన అంబటి రాంబాబే నిలదీస్తుంటే కూటమి ప్రభుత్వం జవాబు చెప్పాలి కదా?




