మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపితో కేవలం పదిరోజుల సహవాసంతోనే చాలా త్వరగా రాజకీయాలు ఒంట బట్టించుకున్నాడు. పార్టీలో టికెట్ లభించదని తెలుసుకున్న మరుక్షణం రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. అయితే ఆయన మళ్ళీ క్రికెట్ ఆడుకోవడానికే వెళ్ళాడని వైసీపి నేతలు సర్ధిచెప్పుకున్నారు.
అతను కూడా కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని బ్యాట్ మీద ఒట్టేసి చెప్పాడు. కానీ మూడు రోజులకే ఆ ఒట్టు తీసి క్రీజ్ అవతల పెట్టేసి నేడు హైదరాబాద్‌లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.
ఆయన స్పీడు చూసి టిడిపి, జనసేన, వైసీపిలో కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కనుక ఈసారి నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటి తలుపు తట్టాడని అర్దమవుతూనే ఉంది. అయితే ఇంత నిలకడలేని అంబటి రాయుడుని జనసేనలో తీసుకుంటే ఆయనకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో ఉంటానని హామీ ఇవ్వగలడా? ఇవ్వకపోతే పార్టీలో చేరుతాడా?ఒకవేళ జనసేనలోని అభ్యర్ధులను కాదని అతనికే టికెట్ ఇచ్చినా తప్పకుండా గెలుస్తానని చెప్పగలడా?ఒకవేళ ఏ కారణంగానైనా జనసేనలో చేరకపోతే అంబటి రాయుడు ఏ పార్టీ తలుపు తడతాడు? అని అప్పుడే జనసేనలోనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అంబటి రాయుడు సంగతి ఎలా ఉన్నా అతని మాట కాదనలేక పవన్ కళ్యాణ్ కమిట్ అయిపోతేనే ప్రమాదం!




