టిడిపి, జనసేన, బీజేపీల పొత్తులు దాదాపు ఖరారు అయిన్నట్లు తెలుస్తోంది. బీజేపీకి తిరుపతి, రాజంపేట, అరకు, రాజమండ్రి, నరసాపురం ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టిడిపి, జనసేనల అంగీకరించిన్నట్లు తెలుస్తోంది.
అదేవిదంగా శ్రీకాళహస్తి, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ సెంట్రల్, విశాఖ నార్త్, అరకు శాసనసభ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించిన్నట్లు తెలుస్తోంది.
అయితే వీటికి అదనంగా బీజేపీ మరో మూడు ఎంపీ సీట్లను కోరుతున్నట్లు తెలుస్తోంది. వీటిపై చర్చించేందుకే మరికొద్ది సేపటిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. కనుక ఏ క్షణంలోనైనా మూడు పార్టీల పొత్తులు కుదిరిన్నట్లు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇది ఊహించిన పరిణామమే అయినప్పటికీ వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి, వైసీపి నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
టిడిపి, జనసేనలు కలవకుండా దూరంగా ఉంచేందుకు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా కలవకుండా ఆపలేకపోయినా కనీసం వాటితో బీజేపీ కలవకుండా అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు. దాంతో ఓ నెల రోజులు వాయిదా పడేలా చేయగలిగేరే తప్ప వాటితో బీజేపీ కలవడం అడ్డుకోలేకపోయారు.
ఆ బాధ, ఆందోళన, ఉబికి వస్తున్న కన్నీళ్ళు అన్నీ ఆత్మసాక్షిలో ఒలికించి వైసీపి అధినేత గుండెల్లో బరువు, కడుపులో మంట చల్లర్చే ప్రయత్నం చేసింది.
గతంలో ఎన్డీయే కూటమి నుంచి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసినప్పుడు జరిగిన చరిత్రని మరిచిపోయి బీజేపీ టిడిపితో స్నేహం చేయడం ధర్మమేనా?విజ్ఞత అనిపించుకుంటుందా? అంటూ శ్రేయోభిలాషి బాధ్యతని భుజాన్న వేసుకున్నప్పటికీ, మరో గంటలో ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్యల మాదిరిగా శత్రువుగా మారిపోకుండా ఉంటుందా?
“అందరికీ మేలు చేయడమే తప్ప మరేమీ తెలీని మీ ఈ బిడ్డపై విరుచుకు పడేందుకు తోడేళ్ళ గుంపులో మరో బలమైన తోడేలు చేరింది. ఆ తోడేళ్ళ గుంపు నుంచి మీ ఈ బిడ్డని మీరే కాపాడుకోవాలి” అని మొరపెట్టుకోక మానరు.
పనిలో పనిగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసిందో జాబితాని కూడా తీసి చదివి వినిపించక మానరు. ఇంత క్లిష్ట పరిస్థితులలో కూడా వైసీపి 175/25 సీట్లు గెలుచుకోవడం ఖాయమనే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించక మానరు.
కనుక ఇప్పటిదాకా చూసింది టీజర్, ట్రైలర్ మాత్రమే. ఇకపై అసలు సినిమా మొదలవుతుంది. ఎవరు ఎవరికి సినిమా చూపించినా ఆ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రేక్షకులు. సినిమా చూశాక తప్పకుండా మంచి రివ్యూ ఇస్తారనే ఆశిద్దాం.





