అమరావతి సభ @2024 ఎజెండా!

అమరావతి సభ @2024 ఎజెండా!‘ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని’ ‘జై అమరావతి – జై ఆంధ్రప్రదేశ్’ అన్న నినాదాలతో తిరుపతిలో తలపెట్టిన అమరావతి రైతుల ముగింపు సభ బ్రహ్మాండమైన ఆదరణకు నోచుకుంది. రైతులకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు తరలివచ్చారు, ఒక్క అధికార పార్టీ నేతలు తప్ప!

కాంగ్రెస్ నుండి తులసిరెడ్డి, బిజెపి నుండి కన్నా లక్ష్మీ నారాయణ, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడులతో పాటు పలువురు జనసేన సభ్యులు, వామపక్ష నేతలు మరియు అమరావతిని భుజాన పెట్టుకుని రోజు ప్రచారం నిర్వహిస్తోన్న రఘురామకృష్ణం రాజు ఈ సభకు విచ్చేసి అందరి నినాదం ఒక్కటేనని చాటిచెప్పారు.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్ కు నడుమ ఉన్నటువంటి అమరావతి మాత్రమే రాజధానిగా సానుకూల నిర్ణయమని అందరూ నేతలు తేల్చిచెప్పారు. అలాగే రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి నేటి వరకు జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, జగన్ తీరును ఎండకట్టారు. దీనికి ప్రజల నుండి పెద్ద స్పందన లభించింది.

అమరావతి రైతులు తలపెట్టిన ఈ ముగింపు సభ 2024 ఎన్నికల ఎజెండాకు సూచనగా పేర్కొనవచ్చు. అమరావతి రాజధానియే ప్రధాన అజెండాగా రాబోయే ఎన్నికలు జరగొచ్చన్న సంకేతాలను ఈ సభ కలిగించింది. జగన్ అధికారంలో ఉన్నంత వరకు అమరావతికి మద్దతు పలికే అవకాశాలు లేవని స్పష్టంగా తేలిపోవడంతో, రాబోయే రెండేళ్లల్లో కూడా రాజధాని నిర్ణయం ప్రశ్నార్థకంగానే ఉండొచ్చన్నది పొలిటికల్ టాక్.

దీంతో ఈ సభకు తరలివచ్చిన జనసంఖ్యను చూసిన తర్వాత రాజకీయంగా అధికార పార్టీ పలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై మళ్ళీ ఒక్క తాటిపైకి వచ్చే సంకేతాలు స్పష్టం కావడంతో, దానిని ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశానికి ఈ సభ ఆయువు పోసినట్లయింది.

ADVERTISEMENT
Latest Stories