ఒకే ప్రశ్నను తిప్పి తిప్పి అడిగితే ఏమవుతుంది..? ఎంతటి సహనపరులకైనా కాస్త ఆవేశం రావడం సహజమే. మరి నిత్యం షూటింగ్ లతో బిజీబిజీగా గడిపే సెలబ్రిటీలకు అయితే… అది ఒక మెట్టు పైనే ఉంటుందని చెప్పవచ్చు. తాజాగా ‘జబర్దస్త్’ బ్యూటీ అనసూయకు కూడా అలాంటి అనుభవమే ఎదురయ్యింది. అభిమానులతో కలిసి కాసేపు ముచ్చటిస్తున్న సందర్భంలో చాలా మంది పవర్ స్టార్ అభిమానులు… పవన్ తో సినిమా ఎప్పుడు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
మొదటి సారి ఈ ప్రశ్న వచ్చినపుడు బాగానే స్పందించిన అనసూయ సహనానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ పరీక్ష పెట్టినట్లుగా కనపడుతోంది. ‘ఆ అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను, తానూ ఎవరితో నటించకూడదన్న నియమాలేవీ పెట్టుకోలేదని, త్వరలోనే చేస్తానేమో’ అంటూ చెప్పిన పలు సార్లు సమాధానం చెప్పిన తర్వాత కూడా పవన్ అభిమానులు అదే రకమైన ప్రశ్నలు వేయడంతో పాటు మరో మెగా హీరో బన్నీతో ఎప్పుడూ చేస్తావన్న ప్రశ్నలను కూడా అభిమానులు సంధించారు.
అయితే తన ఓపిక నశించడంతో ‘ఛాన్స్ వస్తే చేస్తాను మహాప్రభో’ అంటూ సదరు అభిమానికి దండం పెడుతూ జవాబు ఇవ్వడం విశేషం. గతంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ సినిమాలలో ఐటెం సాంగ్స్ ఆఫర్లు వచ్చినప్పటికీ, ఆ ఇద్దరూ హీరోలను పక్కనపెట్టిన అనసూయ, ‘సోగ్గాడే చిన్నినాయనా’తో అదే ఐటెం సాంగ్ తో ప్రేక్షకులకు పరిచయం కావడంతో… ఈ అభిమానులు అనసూయను అడిగిన ప్రశ్నలకు ప్రాధాన్యత లభించింది. అయితే ఈ సారి వివాదాల్లోకి పోకుండా ‘అవకాశం వస్తే నటిస్తానంటూ’ కాస్త సేఫ్ గేమ్ ఆడినట్లుగా కనపడుతోంది.



