ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో గర్వంగా చెప్పుకోవలసిన అమరావతి రాజధానిని వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్ళి పెద్ద పంచాయితీగా మార్చేయడం చాలా బాధాకరం. రాజధానితో రాష్ట్రాభివృద్ధి మాత్రమే కాదు… ఆంధ్రా ప్రజల భావోద్వేగాలు కూడా ముడిపడి ఉన్నాయనే విషయం గ్రహించకపోవడం విస్మయం కలిగిస్తుంది. అమరావతి గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని బాధపెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న మంత్రులు, తమ మాటలతో ప్రజల మనోభావాలను కూడా దెబ్బ తీస్తున్నామని గ్రహించడం లేదు.
అదే… వైసీపీ అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసి, రూపు రేఖలు తెచ్చి ఉండి ఉంటే నేడు దాని రాజకీయ భవిష్యత్ చాలా ఉజ్వలంగా ఉండేది కానీ లభించిన ఒక్క ఛాన్స్ ని వృధా చేసుకొందని చెప్పక తప్పదు. వైసీపీ నిర్వాకం వలన రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. అందుకు సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరూ సిగ్గుపడటం లేదు కూడా.
ప్రస్తుతం ‘రాజధాని పంచాయితీ’ సుప్రీంకోర్టులో ఉంది. కేసుల ఒత్తిడి కారణంగా మొదట జూలై 11న దీనిపై విచారణ చేపట్టాలని నిర్ణయించింది కానీ ఇప్పుడు దానిని ముందుకు జరిపి ఈ నెల 9వ తేదీన విచారణ జరుపుతామని తెలియజేసింది. ఇది చాలా శుభపరిణామమే అనుకోవచ్చు.
ఒకవేళ సుప్రీంకోర్టు మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే, అప్పుడు అదే దాని పీక మీద కత్తిగా మారుతుంది. ఏవిదంగా అంటే, ఎన్నికల వరకు సుప్రీంకోర్టు రాజధాని అంశంపై తీర్పు చెప్పకుండా వాయిదా వేసుంటే, వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుపై నెపం పెట్టి వైసీపీ తప్పించుకొనే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వైసీపీకి ఆ అవకాశం ఉండదు.
ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉన్నందున మిగిలిన ఈ కొద్దిపాటి పుణ్యాకాలంలో మూడు రాజధానులు విషయంలో వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి, సామర్ధ్యం ఏమిటో కూడా తేటతెల్లమైపోతాయి. ఎలాగూ మూడు రాజధానులని ముచ్చటపడుతోంది కనుక ఎంతో కొంత పనులు పూర్తిచేసి అదే అంశంతో ఎన్నికలకు వెళ్ళి ప్రజలను మెప్పించవలసి ఉంటుంది. కానీ ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులలో ఉద్యోగులకు జీతాలే చెల్లించలేకపోతోంది కనుక మూడు రాజధానుల ఏర్పాటు అసాధ్యమే అని భావించవచ్చు. అప్పుడు వైసీపీ నేతలు ఏ మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తారో చూడాలి.
ఒకవేళ సుప్రీంకోర్టు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తీర్పు చెప్పితే, వైసీపీకి చెంపదెబ్బ కొట్టిన్నట్లే అవుతుంది. ఇక అప్పీలు చేసుకోవడానికి, మూడు రాజధానులని వాదించడానికి దానికి అవకాశమే ఉండదు. పైగా రాజధాని నిర్మాణ పనులు 5 ఏళ్ళపాటు నిలిపివేసి రాష్ట్రానికి తీరని నష్టం చేసిందని ప్రతిపక్షాలు వాదించకుండా ఉండవు. అప్పుడు ప్రజలకు సంజాయిషీ చెప్పుకోవడానికి కూడా ఏమీ ఉండదు. కనుక రాజధాని అంశంపై సుప్రీంకోర్టుకి వెళ్ళి వైసీపీ చాలా పెద్ద తప్పే చేసిందని భావించవచ్చు.



