ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఎన్నికైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్ ఆహ్వానించారు. ఈ క్రమంలో జగన్ ను ప్రధాని ఆలింగనం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా జగన్ ప్రధానికి తిరుమల స్వామి వారి శాలువా, స్వామి వారి మూర్తి ఒకటి బహూకరించి హిందుత్వ టచ్ ఇచ్చారు.
దాదాపు గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని సమస్యలను జగన్ మోహన్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని హామీలను సత్వరమే నెరవేర్చాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించి కేంద్రం సాయం అందించాలని విన్నవించారు. ఆ తరువాత ప్రధాని రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రధాని జగన్ ఆలింగనం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జగన్ ప్రమాణస్వీకారం చేస్తున్న రోజే (మే 30న) నరేంద్ర మోడీ కూడా రెండో సారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చెయ్యనుండడంతో ఆయన విజయవాడ వచ్చే అవకాశం లేన్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా 30న తాను మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ తెలిపారు. ఆ తరువాత మరో వారం, పదిరోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని మీడియాకు తెలిపారు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో కేబినెట్ కూర్పుకు కొంత సమయంలో తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం.



