తెలుగు రాజకీయాలలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ గెలుపు ఓటముల మధ్య 2% వ్యత్యాసం మాత్రమే ఉండటంతో ఓటర్ల నాడి పట్టుకోవడం కష్టమైన పని. ఢిల్లీ స్టూడియోలలో కూర్చుని చేసే సర్వేలలో కాంగ్రెస్ కు బీజేపీలకు కూడా సీట్లు ఇచ్చేసి దక్షిణాది గురించి మాకేమీ తెలియదు అని క్లియర్ గానే చెప్పేసాయి జాతీయ ఛానల్స్. అలా అని స్థానిక టీవీ ఛానెల్స్ అయినా ఖచ్చితమైన సర్వేలు ఇస్తాయా అంటే అదీ లేదు. గతంలో ఒకటి రెండు పర్యాయాలు కొన్ని ఛానల్స్ అటువంటి ప్రయత్నాలు చేసినా విఫలం అయ్యాయి.
అయితే ఇటువంటి సర్వేల వల్ల టీవీ ఛానల్స్ కు విపరీతమైన టీఆర్ఫీ రేటింగ్స్ వస్తాయి. దీనితో ఆ ఛానల్స్ వాటి జోలికి వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. గతంలో ఎన్టీవీ, ఏబీఎన్ ఛానల్స్ కొన్ని సర్వే ఫలితాలు వెల్లడించి అభాసుపాలు అయ్యాయి. ఈ క్రమంలో ఈనెల 19న అవి ఏం చెయ్యబోతున్నాయి అనేది చూడాల్సి ఉంది. అదీ గాక ఎవరికైనా అనుకూలంగా సర్వే ఇచ్చి ఆ తరువాత వేరే ప్రభుత్వం వస్తే తమ పరిస్థితి ఏంటి అనేది ఇంకో టెన్షన్. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఛానల్స్ అన్ని ఏదో ఒక పార్టీకు మద్దతు ఇచ్చేవే అనే ముద్ర కూడా ఉంది. ఆ పరిధి దాటి అవి విశ్లేషించగలవా అనేది చూడాలి.
19వ తారీఖునే లగడపాటి రాజగోపాల్ కూడా తన సర్వే విడుదల చెయ్యబోతున్నారు. అయితే ఆయన మొట్టమొదటి సారిగా గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఘోరంగా దెబ్బ తిన్నారు. తెరాస సునాయాసంగా గెలిచిన ఎన్నికలలో ఆయన మహాకూటమి గెలుస్తుందని చెప్పారు. దీనితో పరువు పోయింది. తెలంగాణాలో గురి తప్పినా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి ఆయన సర్వే కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకసారి పప్పులో కాలేసిన లగడపాటి ఈసారి కసిగా పని చేస్తున్నట్టు సమాచారం.



