అవునన్నా కాదన్నా నేటి రాజకీయాలలో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయింది. అన్ని పార్టీలకు కలిపి ఇటీవలే జరిగిన ఎన్నికలలో 10 వేల కోట్లు ఖర్చు అయివుంటుందని సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి రెండు రోజుల క్రితం చెప్పుకొచ్చారు. నియోజకవర్గానికి సరాసరి 25 కోట్ల నుండి కొన్ని చోట్ల అది 50 కోట్లకు చేరిందట. ఒకరిద్దరు ఏకంగా 70 కోట్లు కూడా ఖర్చు పెట్టారట. అయితే ఈ సారి ఎన్నికలలో డబ్బు పంపిణీ విషయంలో కొన్ని చిత్రాలు చోటు చేసుకున్నాయని సమాచారం.
డబ్బు పంపిణీ విషయంలో అధికార టీడీపీ పార్టీ కంటే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ముందు ఉందట. ఓడిపోతే భవిష్యత్తు లేదు అని చేతికి ఎముక లేకుండా ఖర్చుపెట్టారట ఆ పార్టీ నేతలు. టీడీపీలో కొందరు నేతలు బాగా ఖర్చు పెట్టినా చాలా మంది ప్రభుత్వం పసుపుకుంకుమ, రైతు రుణ మాఫీ, అన్నదాత సుఖీభవ రూపంలో డబ్బులు ఇస్తుంది కదా సరిపోతాయిలే అని తమ డబ్బులు మిగుల్చుకున్నారంట. ఇటువంటి చోట్ల ఆ ప్రాంతం జనం బాగా నిరుత్సాహపడ్డారని టీడీపీ అంతర్గత విశ్లేషణ.
దీనివల్ల నష్టం జరిగి ఉండొచ్చని ఆ పార్టీ భయపడుతుంది. ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ కొన్ని చోట్ల మాత్రమే డబ్బు ఖర్చు పెట్టిందట. అది కూడా చాలా చోట్ల రెండు పార్టీలతోనూ పోటీ పడలేకపోయినట్టు సమాచారం. కేవలం 2-3 చోట్ల మాత్రమే ప్రధాన పార్టీలతో సమానంగా ఆ పార్టీ డబ్బులు ఇచ్చినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరంలో ఆ పార్టీ మిగతా పార్టీలతో సమానంగా డబ్బు పంచినట్టు తెలుస్తుంది. ఏది ఎలా ఉన్నా మొత్తానికి అదృష్ట లక్ష్మి మే 23న ఎవరిని వరిస్తుందో చూడాలి.



