జీవో నెంబర్ 35ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఏపీ సర్కార్ దాఖలు చేసిన ‘లంచ్ మోషన్ పిటిషన్’ను విచారించిన హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తరపున వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరగా, సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ధియేటర్ ఓనర్లు టికెట్ ధరల ప్రతిపాదనను జాయింట్ కలెక్టర్ కు తెలపాలని, దీనిపై జాయింట్ కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. అలాగే టికెట్ ధరలపై తీసుకునే నిర్ణయంలో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సినీ పరిశ్రమ మదనపడుతోన్న టికెట్ ధరలు మరియు బెనిఫిట్ షోల విషయం ఇప్పుడే తేలే అంశం కాదని తెలిసిపోయింది. దీంతో “పుష్ప” బెనిఫిట్ షోల కోసం నిరీక్షిస్తోన్న అశేష అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అలాగే ఏపీ సర్కార్ అవలంభిస్తోన్న తీరుతో జీవో నెంబర్ 35 అనుసరించే టికెట్ ధరలు కూడా ఉండే అవకాశం ఉంది.
ఒకవేళ జాయింట్ కలెక్టర్ పాత రేట్లకు టికెట్లు అమ్ముకోవచ్చని తీర్మానిస్తే మాత్రం పెద్ద గండం నుండి “పుష్ప” బయట పడినట్లే! లేక ప్రభుత్వానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే, ‘అఖండ’ మాదిరే ‘పుష్ప’ రేంజ్ ను బట్టి ఓ 20 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. టికెట్ ధరలు ఇంకా నిర్ణయం కాకపోవడంతో ఏపీలో చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు.
ఇక బుధవారం నాడు గుంటూరు జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు జరిగిన ధియేటర్ ల చెకింగ్ లో సత్తెనపల్లిలో ఓ ధియేటర్ ను సీజ్ చేసారు అధికారులు. డిసెంబర్ 2వ తేదీన అనుమతి లేకుండా “అఖండ” బెనిఫిట్ షోను ప్రదర్శించినందున సత్తెనపల్లిలో శ్రీలక్ష్మి ధియేటర్ ను రెవిన్యూ అధికారులు సీజ్ చేసారు. ఏపీలో చిత్ర పరిశ్రమను టార్గెట్ చేస్తూ జరుగుతోన్న పరిణామాలు సినీ వర్గాలతో పాటు అభిమానులను తీవ్రంగా కలచి వేస్తున్నాయి.



