ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు మొదలైంది. మొత్తం 7,767 ఎంపీటీసీ స్థానాలకు 2,051 ఏకగ్రీవమయ్యాయి. అలాగే మొత్తం 582 జడ్పీటీసీ స్థానాల్లో 77 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వాటికి మొన్న 5వ తేదీన ఎన్నికలు నిర్వహించి నేడు ఓట్ల లెక్కిస్తున్నారు.
ఉదయం 11.30 గంటల వరకు జడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో కూటమి 78 స్థానాలు గెలుచుకొని మరో 90 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. వైసీపీ 1 స్థానం గెలుచుకొని మరో 8 స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
ఎంపీటీసీ ఓట్ల లెక్కింపులో కూటమి 1,940 స్థానాలు గెలుచుకోగా, వైసీపీ 94, ఇతరులు 32 స్థానాల్లో విజయం సాధించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నేడు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లనే లెక్కించగా కూటమికి స్పష్టమైన ఆధిక్యం వస్తోంది. అంటే ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు కూటమి ప్రభుత్వానికే జై కొట్టారన్నమాట!
కోర్టులో రకరకాల కారణాలతో కేసులు వేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలని విఫలయత్నం చేసిన వైసీపీ, ఆ తర్వాత అభ్యర్ధులను నామినేషన్స్ వేయనీయకుండా అడ్డుకున్నారని, రిగ్గింగ్ చేశారంటూ ఓటమికి ముందే అనేక సాకులు సిద్ధం చేసుకుంది. కనుక ‘ఇవి ఎలక్షన్స్ కావు సెలక్షన్స్’ అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎన్నికలు ఏవిధంగా జరిగాయో అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదేవిధంగా అరాచకాలకు పాల్పడి, దానిని కూటమికి ఆపాదించి నిందిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. .
కానీ నేడు వెలువడుతున్న ఈ ఫలితాలు కూడా చూస్తున్నప్పుడు, ఈ ఎన్నికలలో జగన్ వ్యూహాలు ఏవీ ఫలించలేదని స్పష్టమైంది.
అంతేకాదు.. వైసీపీ ఓటమి తప్పదని ముందే తెలిసున్నా అత్యుత్సాహం ప్రదర్శించి ఓటమిని భూతద్దంలో నుంచి చూపినట్లు మరింత పెద్దదిగా చేసి చూపుకున్నారు కూడా. రాజకీయంగా ఇది మరో తప్పిదమనే భావించవచ్చు.
ఈ స్థానిక విజయం కూటమికి చాలా ముఖ్యం. గ్రామస్థాయి వరకు కూటమి బలపడింది. ఈ ఎన్నికల తర్వాత కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు విడుదలవుతాయి. కనుక గ్రామస్థాయి వరకు అభివృద్ధి పనులు చేపట్టగలదు.
చివరిగా ఒక్క మాట. ఈ ఎన్నికలు జనసేనకు ఇంకా ముఖ్యం. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనసేన తన సత్తా చాటుకోగలిగింది.
కనుక ఇదే ఉత్సాహంతో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకోగలిగితే 2029 ఎన్నికల్లో మరిన్ని ఎమ్మెల్యే సీట్లు తీసుకుని గెలుచుకోగలదు.





