తెలంగాణలో సాధ్యంకాని బీసీ రిజర్వేషన్స్ ఏపీలో ఎలా సాధ్యం?

AP local elections BC reservations

స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరుగకపోతే వాటికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల కావు. కనుక వాటి గడువు ముగిసేలోగానే ఎన్నికలు నిర్వహించడం సరైన పద్దతి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు సిద్ధంగానే ఉంది. అయితే వీటిలో బీసీలకు 34శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని నిర్ణయించడంతో ఎన్నికలకు అవరోధంగా మారే అవకాశం కనిపిస్తోంది.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని రకాల రిజర్వేషన్స్ కలిపి 50 శాతం మించకూడదు. కానీ ప్రభుత్వం బీసీలకు 34శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని నిర్ణయించడంతో ఆ పరిధి దాటిపోతుంది.

ADVERTISEMENT

తెలంగాణ ప్రభుత్వం ఈవిధంగానే బీసీ రిజర్వేషన్స్ పెంచినప్పుడు, హైకోర్టు ఆ జీవో కొట్టివేసింది. దాంతో పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఏపీలో కూడా సరిగ్గా ఇదే జరుగబోతోందని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ స్పష్టం చేస్తోంది.

ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్ రావు తరపున న్యాయవాది ఏ.సత్యప్రసాద్, న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో పిటిషన్స్ వేశారు.

జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం బుధవారం వాటిపై విచారణ చేపట్టినప్పుడు, బీసీ రిజర్వేషన్స్ పెంపు వలన ఇలాంటి న్యాయ సమస్యలు ఎదురవుతాయని, వాటి వలన స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతాయని పిటిషనర్లు వాదించారు.

హైకోర్టు ధర్మాసనం కూడా వారి వాదనలతో ఏకీభవించింది. రాష్ట్ర ప్రభుత్వానికి అటార్నీ జనరల్ తగిన సలహా ఇచ్చి, ఎన్నికలు ఆలస్యం కాకుండా చూడాలని సూచించింది.

ఏపీతో పోలిస్తే తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ కనుక అక్కడి ప్రభుత్వం ఆ ప్రాతిపదికన రిజర్వేషన్స్ పెంచాలనుకోవడం సహేతుకంగానే కనిపిస్తుంది. అయినప్పటికీ సుప్రీంకోర్టు మార్గదర్శకాల కారణంగా రిజర్వేషన్స్ పెంచలేకపోయింది.

ఈ విషయం ఏపీ ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ బీసీలకు 34శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో సాధ్యం కానప్పుడు ఏపీలో ఏవిధంగా సాధ్యపడుతుందో?

సాధ్యపడదని తెలిసి ఉన్నప్పుడు బీసీల సంక్షేమం కోసం మరేదైనా చేయవచ్చు. కానీ ఈవిధంగా ముడిపెట్టుకుని ఎన్నికలు ఆలస్యమైతే స్థానిక సంస్థలకు నిధులు అందవు కదా?

ADVERTISEMENT
Latest Stories