నాగార్జున సాగర్ డ్యామ్ మీద జరుగుతున్న పరిణామాలను అందరూ చూస్తూనే ఉన్నారు. రెండు రాష్ట్రాల మద్య ఈ గొడవ ప్రమాదకరంగా మారుతుండటంతో కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకొని డ్యామ్‌ను కృష్ణాబోర్డుకి అప్పగించాలని, తక్షణం ఇరు రాష్ట్రాల పోలీసులను అక్కడి నుంచి వెనక్కు రప్పించుకోవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. కేంద్ర బలగాలు డ్యామ్‌ను తమ అధీనంలోకి తీసుకొంటున్నాయి.
అయితే ఈ డ్యామ్- డ్రామా వెనక అసలు కధేమిటి?అనే ప్రశ్నకు ఇప్పటికే కొన్ని సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికలలో కేసీఆర్‌కు ఎదురుగాలి వీస్తోందని మొదటి నుంచే సర్వేలు చెపుతున్నాయి. కనుక పోలింగ్ రోజున తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకే, కేసీఆర్, జగన్ ఇద్దరూ కలిసి డ్యామ్ మీద ఈ డ్రామా ఆడించారని, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
వాటిని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. ఏపీ రాష్ట్ర హక్కులు, రైతుల ప్రయోజనాల కోసమే ఆ విదంగా చేశాము తప్ప తమకు తెలంగాణ రాజకీయాలతో, అక్కడ జరుగుతున్న ఎన్నికలతో ఎటువంటి సంబంధమూ లేదని తమ చర్యను సమర్ధించుకొన్నారు.
అయితే వైసీపి ప్రభుత్వానికి నిజంగానే రైతులకు నీళ్ళు అందించాలనే చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఇదేపని నాలుగేళ్ళ క్రితమే చేసి ఉండాలి కదా? కానీ సరిగ్గా తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న రోజునే ఎందుకు చేసింది?ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా చేయవచ్చు కదా?అనే ప్రతిపక్షాల ప్రశ్నకు అంబటి వద్ద జవాబు లేదు.
2019 ఎన్నికలలో ఏపీలో వైసీపిని గెలిపించేందుకు కేసీఆర్ తోడ్పడ్డారు కనుక ఇప్పుడు ఎదురీదుతున్న ఆయనను గెలిపించేందుకే వైసీపి ప్రభుత్వం ఈ డ్రామా ఆడించి ఉండవచ్చు. కేసీఆర్ ఓడిపోయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ఏపీ ఎన్నికలలో తమను దెబ్బ తీయడానికి టిడిపికి సహకరించవచ్చనే భయం కూడా ఉండి ఉండవచ్చు.
నాగార్జున సాగర్ డ్యామ్‌ని, దానిపై నిర్వహిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రెండుమూడేళ్ళ క్రితమే సూచించినప్పుడు జగన్ అంగీకరించారు కానీ కేసీఆర్ అంగీకరించలేదు. కానీ ఇప్పుడు వెంటనే అంగీకరించి డ్యామ్ నిర్వహణ భాద్యతలను కృష్ణాబోర్డుకి అప్పగించేస్తుండటం గమనిస్తే, మరో రాజకీయ కారణం కూడా కనిపిస్తోంది.
తెలంగాణలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేతికి నాగార్జున సాగార్ డ్యామ్ నిర్వహణ బాధ్యతలు చిక్కకుండా చేసేందుకే ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి ఈవిదంగా చేసి ఉండవచ్చు. రేపటి నుంచి బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి మారినప్పుడు, తాము అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా పాలకులు చెప్పిన్నట్లు ఆడుతోందని నిందించడానికి వెసులుబాటు లభిస్తుంది. కనుక ఇటువంటి చాలా బలమైన రాజకీయ కారణాలతోనే నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఈ డ్రామా నడిపించి ఉండవచ్చు.




