“ప్రత్యేక హోదా” గుట్టు తెలిసింది… ఏపీకి రావాల్సిందే..!

ap-puts-up-new-bids-for-special-statusరాష్ట్ర విభజన తర్వాత ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న నవ్యాంధ్రప్రదేశ్ కు “ప్రత్యేక హోదా” ప్రకటించాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా అర్హత లేదన్న వాదనను కేంద్రం తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా డిమాండ్ వదిలేస్తే… నిధులను ఇబ్బడిముబ్బడిగా ఇస్తామని కేంద్రం పలికిన చిలక పలుకులకు కూడా కొదవలేదు.

దేశంలోని చాలా రాష్ట్రాలకు ‘ప్రత్యేక హోదా’ దక్కగా… ఒక్క ఏపీ విషయంలోనే మెలికలెందుకు పెడుతున్నారన్న ఆవేదన రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఈ విషయానికి సంబంధించిన అసలు మతలబేమిటో తేల్చేద్దామని రంగంలోకి దిగిన ఏపీకి చెందిన న్యాయవాది శ్రావణ్ కుమార్ ‘నీతి ఆయోగ్’కు సమాచార హక్కు చట్టంతో అస్త్రం సంధించారు. సదరు అర్జీకి నీతి ఆయోగ్ స్పందించక తప్పలేదు. అసలు వాస్తవాలు వెల్లడించక తప్పలేదు.

ADVERTISEMENT

నీతి ఆయోగ్ వివరణ ప్రకారం… ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ప్రకటించే అర్హత ఒక్క “జాతీయ అభివృద్ధి మండలి” (నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్-ఎన్డీసీ)కు మాత్రమే ఉంది. గతంలో ప్రత్యేక హోదా ప్రకటించింది, ఇక భవిష్యత్తులో అలాంటి హోదా ప్రకటించే ఒకే ఒక్క సంస్థ ఎన్డీసీనే. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించేందుకు ఆ సంస్థ ప్రధానంగా ఐదు మార్గదర్శకాలను ప్రాతిపదికగా తీసుకుంటోంది.

1) కొండ ప్రాంతం, 2) జన సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతం లేక గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రాంతం, 3) పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకునే వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటం, 4) ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా వెనుకబడి ఉండటం, 5) రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం… తదితరాలు అంశాలు ఉన్నాయి. ఇందులో 4, 5 వ మార్గదర్శకాల ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా పొందడానికి అర్హత ఉంది. అయినా రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ను ఇవ్వకుండా ఎందుకు మెలికలు పెడుతుందో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది.

ADVERTISEMENT
Latest Stories