ఒకరు బాగుపడితే ఏడ్చేవారు సమాజంలో చాలా మందే ఉంటారు. కనుక ఆటో రిక్షాల వెనుక ‘మీ ఏడ్పులు మాకు దీవెనలు,’ ‘అందరూ బాగుండాలి.. వారిలో నేనుండాలి,’ వంటి కొటేషన్స్ కనిపిస్తుంటాయి.
అయితే ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని వేల పుస్తకాలు చదివేసినా కొందరికి ఇంగిత జ్ఞానం అబ్బదు. కనుక ప్రసూతీ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అన్నట్లు బయటకు వచ్చేసరికి మళ్ళీ మామూలే.
ముందే చెప్పుకున్నట్లు ఒకరి ఏడ్పులే మనకి దీవెనలు అనుకొని ఆటోరిక్షాలా ముందుకు సాగిపోతూనే ఉండాలి. అంతేకాదు ఒకరు మనపై ఏడుస్తున్నారంటే అది మన ఎదుగుదలకి నిదర్శనం లేదా కొలమానం అనుకోవచ్చు. కనుక వారి ఏడ్పులలో మన ఎదుగుదల, విజయం కూడా ఉన్నాయని సంతోషించవచ్చు.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో తెలంగాణలో రాజకీయ నాయకులకు ఎటువంటి సంబంధమూ లేదు.
ముఖ్యంగా తన రాజకీయ మనుగడ కోసం సొంత కుంపటి పెట్టుకున్న కల్వకుంట్ల కవిత వంటి వారికి అసలే అవసరం లేదు. కానీ అవకాశం చిక్కినప్పుడల్లా అమరావతి మునిగిపోతోందంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూనే ఉంటారు.
అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమరావతికి పోటీగా ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసుకుంటోంది తప్ప సిఎం, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎవరూ అమరావతి గురించి ఇలా చులకనగా మాట్లాడరు.
సరే! ఇరుగుపొరుగులు ఏడిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ మన రాష్ట్రానికి దివ్యమైన రాజధాని కళ్ళ ముందే చకచకా నిర్మాణమవుతుంటే చూసి సంతోషించాల్సిన వైసీపీ నేతలు, వారి సొంత, అనుకూల మీడియా కూడా వర్షం వస్తే అమరావతి మునిగిపోతుందని ఏడుస్తుండటం శోచనీయం. ఇక్కడ వారు పాడే ఈ ‘వర్షం పాట’ తెలంగాణలో కొందరు ప్రతిపక్ష నాయకుల నోట ప్రతిధ్వనిస్తోంది. అంటే అర్థం ఏమిటి?
అమరావతి మునిగిపోకుండా నీళ్ళు ఎత్తిపోసుకునే దుస్థితి నెలకొందని మనోళ్ళే వాదిస్తున్నారు. నిజమే! కానీ సరిగ్గా ఇదే అమరావతికి ‘ప్లస్ పాయింట్’ అనుకోవచ్చు కదా?
అమరావతికి పుష్కలంగా వరద నీరు లభ్యత ఉంది కనుక చుట్టూ రిజర్వాయర్స్, పంప్ హౌసులు నిర్మించుకొని, భవిష్యత్‌లో కూడా అమరావతికి నీటి కొరత లేకుండా చేసుకోగలుగుతున్నాము కదా?
హైదరాబాద్‌కి నీటి కొరత నివారించేందుకు నగరం నలువైపులా రిజర్వాయర్స్ నిర్మించుకుంటోంది అక్కడి ప్రభుత్వం. దూరంగా ఉన్న గోదావరి నుంచి కాలువలు తవ్వుకొని నీటిని తెచ్చి వాటిలో ఎత్తి పోసుకుంటున్నారు. కానీ వరుణ దేవుడే అమరావతిని ఆశీర్వదించి పుష్కలంగా నీళ్ళు అందిస్తుంటే సంతోషించాలి కానీ ఏడ్పులు దేనికి?
హైదరాబాద్ చుట్టూ రిజర్వాయర్స్ నిర్మించుకోవడం గొప్ప ఆలోచన. కానీ అమరావతి చుట్టూ నిర్మించుకోవడం తెలివి తక్కువ పని! ఈ వితండవాదం ఈర్ష్య, ద్వేషం నుంచి పుట్టుకొచ్చినదే అని అర్ధమవుతూనే ఉంది.
అమరావతి చుట్టూ చుట్టుపక్కల గ్రామాలలో వ్యవసాయానికి కూడా నీరు అందించేందుకు వీలుగా రిజర్వాయర్లని నిర్మిస్తుంటే అందుకు సంతోషించాలి కానీ ఈ ఏడ్పులు, సన్నాయి నొక్కులు దేనికి?
ఎవరు లోలోన కుమిలిపోతున్నా, ఎవరు ఎంత గట్టిగా ఏడ్చినా అమరావతి నిర్మాణం ఆగదు. ఆపలేరు.
ఈ విషయం అందరికీ స్పష్టమైంది కనుకనే ఆపకుండా ఏడుస్తున్నారు. కానీ ఈ ఏడ్పులు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే, నిర్మాణ దశలో ఉన్న అమరావతిని చూసి ఇంతగా ఏడుస్తున్నవారు రేపు దేశ విదేశీ సంస్థలతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో కళకళలాడబోతున్న అమరావతిని చూస్తే ఏడుపులు ఆపుకోగాలరా? కనుక ఈ ఏడ్పులు శాశ్వితం… అమరావతి అభివృద్ధి నిజం.




