ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల జీపీఎఫ్ ఖాతాలలో రూ.800 కోట్లు ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంపై ప్రభుత్వోద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల సంఘం నేతలు సూర్యనారాయణ, ఆస్కార్ రావు ఇవాళ్ళ సచివాలయానికి వెళ్ళి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి దీనిపై వివరణ అడిగారు.
సాంకేతిక కారణాలతోనే ఉద్యోగుల ఖాతాలలో నుంచి డబ్బు డెబిట్ అయ్యిందని సీపీఎంఎస్ అధికారులు చెపుతుంటే, ఉద్యోగుల డీఏ బకాయిల చెల్లింపుకు ప్రభుత్వం అనుమతించని కారణంగా డబ్బు డెబిట్ అయ్యిందని ఆర్ధికశాఖ అధికారులు చెపుతున్నారని చెప్పారు. రెంటిలో ఏది నిజమని వారు సమీర్ శర్మను నిలదీశారు.
తమ డీఏల చెల్లింపుకు ప్రభుత్వం అనుమతించింది గనుకనే తమ ఖాతాలలో ఆ డబ్బు జమా అయ్యిందని, కనుక దానిని తమకు తెలియకుండా వెనక్కు తీసుకోవడం నేరమని సూర్యనారాయణ అన్నారు. ఒకవేళ ప్రభుత్వం అనుమతించకపోతే 90,000 మంది ఉద్యోగుల ఖాతాలలో పొరపాటున రూ.800 కోట్లు జమా చేసేయడానికి అధికారులు కళ్ళు మూసుకొని పనిచేయడం లేదు కదా?అని సూర్యనారాయణ ప్రశ్నించారు.
జరిగిన పొరపాటును సరిదిద్దుకోకుండా ఆర్ధికశాఖ, సీపీఎంఎస్ అధికారులు పిట్టకధలు చెపుతున్నారని మండి పడ్డారు. మేము ఇంతగా ఆందోళన చెందుతుంటే అధికారులు నిమ్మకు నీరేత్తినట్లున్నారని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తక్షణం మళ్ళీ మా ఖాతాలలో ఆ డబ్బు జమా చేస్తే సరి లేకుంటే హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఒకవేళ కోర్టు మెట్లు ఎక్కితే, సమీర్ శర్మ, సీఎఫ్ఎంఎస్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్, ఆర్ధికశాఖ అధికారులను ఈ కేసులో ప్రతివాదులుగా పేర్కొని కోర్టుకు రప్పిస్తామని ఉద్యోగుల సంఘం నేతలు సూర్యనారాయణ, ఆస్కార్ రావు హెచ్చరించారు. కనుక తమ సమస్యపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు.





