బాబూ… పట్టాల్సింది తిమింగళాలను, చిన్న చేపలను కాదు!

బాబూ... పట్టాల్సింది తిమింగళాలను, చిన్న చేపలను కాదు!2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయాలకు గల కారణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కేవలం 23 అసెంబ్లీ స్థానాలతో చంద్రబాబు సరిపెట్టుకోవడానికి గల కారణాలలో బాబు చేసుకున్న స్వయంకృతాపరాధాలు పక్కన పెడితే, వెన్నుపోటు దారులు తెలుగుదేశం పార్టీ పరాజయానికి మరో ముఖ్య కారణంగా తెలిసి వస్తోంది.

తాజాగా ఓ మీడియాలో జరిగిన చర్చలో భాగంగా వెలుగు చూసిన ఈ కోణం తెలుగుదేశం పార్టీని తలదించుకునేలా చేస్తోంది. “టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుండగా, ఓ నాయకుడు ఫోన్ ఆన్ చేసి ఉండగా, ఆ సమావేశం మొత్తాన్ని ఓ వైసీపీ ఎమ్మెల్యే విన్నారంటూ” చెప్పిన మాటలు తెలుగుదేశం వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

ADVERTISEMENT

పొలిట్ బ్యూరో సమావేశం అంటే… పార్టీకి అత్యున్నతమైన మీటింగ్. అలాంటి సమావేశాన్నే ప్రత్యర్థి పార్టీ చూపే ప్రలోభాలకు లొంగిపోయి, వారి కళ్ళ ముందుంచారంటే, పార్టీకి ఎంత ద్రోహం చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనిని బట్టి ప్రక్షాళన అనేది ఏ స్థాయి నుండి మొదలుపెట్టాలో పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు అవగతం చేసుకోవాలి.

గతంలో ఎన్నడూ లేని విధంగా కోవర్టుల గురించి స్వయంగా ఇటీవల చంద్రబాబు స్పందించారు, అలాగే కొంతమంది చోటా, మోట నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేసారు. అయితే పట్టాల్సింది చిన్న చేపలను కాదు, తిమింగళాలను అన్న విషయం వైరల్ అవుతోన్న ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. మరో విశేషం ఏమిటంటే… పక్క పార్టీలకే కాదు, జర్నలిస్ట్ లకే పొలిట్ బ్యూరో సభ్యులు లొంగిపోతున్నారని ఈ వీడియో ద్వారా వెలుగు చూసిన మరో అంశం.

ఇదేమి సాధారణ విషయం కాదు, తేలికగా తీసుకోవాల్సిన అంశం అంతకంటే కాదు. 2014 అధికారం చేపట్టిన తర్వాత పార్టీలోకి ఎవరు వచ్చినా కాదనకుండా చేర్చుకున్న చంద్రబాబు చాలా సీరియస్ గా పరిగణించాల్సిన అంశం. మునుపటి లాగా చేతులు ముడుచుకుని, మెతక వైఖరితో ముందుకు వెళితే పార్టీ మనుగడే ప్రమాదకరంగా మారిపోయే పరిస్థితి ఉంటుంది.

ఇలాంటి మెతక వైఖరే నేడు పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవడానికి ప్రధాన కారణం. నాడు అధికారం చేతిలో ఉండి కూడా రాజధాని గ్రామాల్లో మంట పెట్టిన వారిని శిక్షించలేకపోయారు, ఏకంగా ఓ రైలునే తగలబెడితే పట్టుకోలేకపోయారు, ప్రతిపక్ష నేత పైన దాడి చేయించింది ఎవరో ప్రజల ముందు ఉంచలేకపోయారు, అలాగే జగన్ అడ్డాలో వివేకా మర్డర్ వెనుక ఎవరి హస్తం ఉందో నిరూపించలేకపోయారు.

వీటన్నిటితో పాటు ఓ మీడియా వర్గం చంద్రబాబును టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారాలను పదే పదే ప్రసారం చేస్తూ ఉంటే, ‘అది చేస్తాం, ఇది చేస్తాం’ అంటూ ప్రగల్భాలు పలకడం తప్ప నాడు ఎలాంటి చర్యలను తీసుకోకుండా ఉపేక్షించిన వైఖరి, చివరికి ఆయనే మెడకే ఉచ్చు బిగుసుకునేలా చేసింది. ఇలా ఒకటి కాదు, అనేక సందర్భాలలో చంద్రబాబు అనుసరించిన విధానాలు, చివరికి ఆయన కన్నీటికే కారణమయ్యాయి.

గతం నుండి పాఠాలు నేర్చుకుని ఉజ్వల భవిష్యత్తు కోసం వర్తమానంలో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. సొంత పార్టీ నేతలనే నియంత్రణలో పెట్టలేని పక్షంలో ప్రత్యర్థి పార్టీ నేతలను ప్రజల ముందు ఎలా దోషులుగా చూపించగలుగుతారు?

ఇప్పటికైనా మించిపోయింది లేదు, 2024 ఎన్నికలు టార్గెట్ గా సరైన నేతలను ఎంపిక చేసుకుని “కోవర్టు” గ్యాంగ్ పనిపడితే, ఏపీలో మరోసారి పసుపు జెండా రెపరెపలాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది చంద్రబాబు తక్షణమే తెలుసుకుని, అమలు చేయాల్సిన విషయం.

ADVERTISEMENT
Latest Stories