సంక్రాంతి తర్వాత మంత్రదండం తిప్పి తెచ్చి ఇస్తారా? అంగన్వాడి

anganwadi-workers-strike-andhra-pradesh

నాలుగున్నరేళ్ళ పాటు పూలనావలా సాగిపోతున్న వైసీపి ప్రభుత్వానికి సరిగ్గా ఎన్నికలకు ముందు ఆటుపోట్లు మొదలయ్యాయి. ఓ వైపు టికెట్స్ కోసం మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మరో వైపు జీతాల పెంచాలని వాలంటీర్లు, అంగన్వాడి కార్యకర్తలు ఆందోళనలతో వైసీపి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.

మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆర్ధిక, మహిళా శిశుసంక్షేమ శాఖ తదితర అధికారులు మంగళవారం సచివాలయంలో అంగన్వాడి కార్యకర్తల సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్‌టియుసి సంఘాల నేతలు ప్రతిధులతో సమావేశమయ్యి సుమారు గంటన్నర పాటు చర్చించారు.

ADVERTISEMENT

అయితే తమని చర్చలపేరుతో సమావేశానికి పిలిచి బెదిరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. జీతాల పెంపుతో సహా ప్రభుత్వం ముందు తాము 11 డిమాండ్స్ పెడితే ఏ ఒక్కదానికీ పూర్తిగా అంగీకరించకుండా మొక్కుబడి పెంపు, చెల్లింపులు చేస్తామని చెపుతున్నారని ఆరోపించారు.

ఏమంటే సంక్షేమ పధకాల కోసమే అప్పులు చేయాల్సివస్తోందని చెపుతున్నారు. అయితే వాటి కోసం ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నప్పుడు ప్రభుత్వం కోసం, సమాజం కోసం పనిచేస్తున్న మాకోసం మరికొంత అప్పుచేయవచ్చు కదా? అంటే సంక్రాంతి వరకు ఆగండని అంటున్నారని అంగన్వాడీ ప్రతినిధులు చెప్పారు.

ఇంతకాలంగా మేము ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా, సమావేశానికి పిలిచినప్పుడల్లా బెదిరిస్తున్న వైసీపి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందనే నమ్మకం పోయింది. నాలుగున్నరేళ్ళలో వెయ్యి రూపాయలు పెంచి సరిపెట్టేశారు. గ్రాట్యూటీ గురించి అడిగితే కేంద్రానికి లేఖ వ్రాశామని తప్పించుకొంటారు. సంక్రాంతి తర్వాత మంత్రదండం తిప్పి డబ్బు తీసుకురాగలిగితే ఆదేదో ఇప్పుడే తిప్పి తెచ్చి ఇవొచ్చు కదా? అని వారు ప్రశ్నిస్తున్నారు.

సంక్రాంతి తర్వాత చూస్తామని చెపుతూన్న నోటితోనే వైసీపి మళ్ళీ అధికారంలోకి వచ్చాక జూన్, జూలై నెలల్లో పెంచుతామని చెపుతున్నారు. అంటే సంక్రాంతి పేరు చెప్పి మరికొన్ని రోజులు గడిపేయాలని ఆలోచిస్తున్నారని అర్దమవుతోంది.

కనుక డిసెంబర్‌ 31వరకు ఎదురుచూస్తాము. లేకుంటే జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడించి మా ఆందోళన ఉదృతం చేస్తామని సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్‌టియుసి సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఏపీలో 53,942 మంది అంగన్వాడి కార్యకర్తలు పనిచేస్తున్నారు. చాలీచాలని జీతాలతో సతమతమవుతూనే సమాజంలో గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు సేవలు చేస్తున్నారు. కానీ వారేమీ వైసీపి కార్యకర్తలు కారు. కనీసం వాలంటీర్లు కూడా కారు. అయినా వాలంటీర్ల కంటే ఎక్కువ జీతమే ఇస్తున్నామని అయినా వారి వలన వైసీపికి ఎటువంటి ప్రయోజనం ఉండదనే భావన ప్రభుత్వానికి ఉండి ఉండవచ్చు. బహుశః అందుకే వారి పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందేమో?

ADVERTISEMENT
Latest Stories