ఇంచార్జ్ ల మార్పు అంటూ వైసీపీ అధినేత జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలలో మార్పులు చేస్తూ అక్కడివారిని ఇక్కడ, ఇక్కడ వారిని అక్కడకు మార్చారు. ఇందులో భాగంగా నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను అక్కడ నుంచి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా తరలించారు.
అయితే 2019 ఎన్నికలలో నెల్లూరు ఎమ్మెల్యే గా పోటీ చేసిన అనిల్ కేవలం ఒక్క పర్శంట్ ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి నారాయణ మీద విజయం సాధించారు. గత ఎన్నికలలో టీడీపీ , జనసేన విడివిడి గా పోటీ చేయడంతో అనిల్ ఒక్క పర్శంట్ తేడా తో గెలిచి నీటి పారుదల శాఖ మంత్రిగా రెండున్నరేళ్లు పదవిలో కొనసాగారు.
ఈ సమయంలోనే ‘నీటి’ పారుదల శాఖ మంత్రిగా కన్నా ‘నోటి’ పారుదల మంత్రిగా అసెంబ్లీ లో ఖ్యాతి గడించారు అనిల్. ఒక ఇరిగేషన్ మంత్రిగా ఉంటూ అసెంబ్లీ లో పోలవరం పై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ”తొందరెందుకన్నా పర్సంటా..? అర పర్సంటా..?” అంటూ టీడీపీ నేతలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
2021 డిసెంబర్ కళ్ళ పోలవరం పూర్తి చేస్తాం తొందరపడకండి అంటూ వెటకారంగా టీడీపీ నేతలకు చెప్పిన సమాధానంతో ‘పర్సంట్’ మంత్రి అంటూ సోషల్ మీడియాలో అనిల్ ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అయితే 2021 లో పోలవరం పూర్తి కాలేదు కానీ ఆయన మంత్రి పదవి కాలం మాత్రం పూర్తి కావడంతో ఇక నోటికి పని తగ్గించి కాస్త సైలెంట్ అయ్యారు అనిల్.
అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే గా, మంత్రిగా ఉంటూ కూడా నెల్లూరు సిటీలో ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోవడంతో స్థానికంగా అనిల్ కుమార్ పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అందునా ఈసారి టీడీపీ, జనసేనలు పొత్తులో కలిసి పోటీ చేయడంతో ఇక్కడ టీడీపీ విజయం దాదాపు ఖరారయినట్లే. సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతను పార్టీకి అంటకుండా జాగ్రత్త పడాలని చూసిన జగన్ అనిల్ ను ఇక్కడి నుండి నర్సరావుపేట ఎంపీ గా తరలించారు.
2019 ఎన్నికలలో నర్సరావుపేట వైసీపీ ఎంపీ గా నెగ్గిన లావు శ్రీ కృష్ణ దేవరాయలు వైసీపీ ని వీడి టీడీపీ కండువా కప్పుకోవడంతో ఈ స్థానాన్ని అనిల్ కుమార్ తో భర్తీ చేసారు జగన్. 2019 ఎన్నికలలో దాదాపు 10 % ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి లావు కృష్ణ టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు మీద విజయం సాధించారు. అయితే 2024 సిట్టింగ్ ఎంపీ గా ఉన్న లావు టీడీపీ తరుపున బరిలో దిగుతుండగా వైసీపీ నుండి అనిల్ సిద్ధమయ్యారు.
అయితే ఈసారి జనసేన, బీజేపీ పొత్తు, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ కి అదనపు బలంగా చెప్పవచ్చు. దానికి తోడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు సొంత అనుచర గణం టీడీపీకి కలిసి వచ్చే అంశాలు. అనిల్ కుమార్ నెల్లూరు నుంచి ఇక్కడికి రావడంతో స్థానికత అంశానికి ఇక్కడి ప్రజలు పెద్దపీట వేసే అవకాశం లేకపోలేదు. అందునా మంత్రిగా ఉన్న సమయంలో అనిల్ నోటికే తప్ప చేతలలో పని చెప్పని కారణంగా అనిల్ పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఉన్న మాట వాస్తవం. ఇవ్వని బేరీజు వేసి చూస్తే అనిల్ ఓటమి పర్సంట్ తోనా..?అర పర్సంట్ తోనా అంటూ కౌంటర్లు వేస్తున్నారు స్థానిక టీడీపీ శ్రేణులు.
2019 ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన మద్దతుదారులు కూడా నన్ను నమ్మి నాకు ఓటేయండి అంటూ అభ్యర్దించిన అనిల్ ఒక్కసారి గెలుపు ఒడ్డుకు చేరగానే అదే టీడీపీ, జనసేన మద్దతుదారుల పైన, ఆ పార్టీల అధినేతల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిలో పలుచనయ్యారు. ఇప్పుడు కూడా ఎన్నికల ముందు సైలెంట్ గా తన పని తానూ చేసుకుంటూ పోతున్నారే తప్ప చంద్రబాబు, పవన్, లోకేష్ పై నోరుపారేయడం లేదు ఈ పర్సంట్, అర పర్సంట్ మాజీ మంత్రి.




