స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జస్టిస్ మల్లిఖార్జున రావు చేసిన వ్యాఖ్యలు గమనిస్తే వైసీపి ప్రభుత్వం రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసేందుకే ఏపీ సీఐడీ చేత ఈ కేసు నమోదు చేయించిందని స్పష్టం అవుతుంది.
- ఆయన నేరం చేసిన్నట్లు ఏపీ సీఐడీ భావిస్తున్నట్లయితే అరెస్ట్ చేయక మునుపే అందుకు తగిన సాక్ష్యాధారాలన్నిటినీ సేకరించి ఉండాలి. కానీ అలా చేయకుండా ముందు అరెస్ట్ చేసింది.
- ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఖాతాలలోకి నిధులు మళ్ళించుకొన్నారనే ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలను ఏపీ సీఐడీ చూపలేకపోయింది.
- స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ద్వారా రాష్ట్రంలో 2.13 లక్షల మంది యువతకు శిక్షణ పొందిన్నట్లు హైకోర్టుకి తెలుసు.
- స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగస్వాములుగా ఉన్న సీమెన్స్ సంస్థ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ సీఎండీ ఖన్‌వేల్కర్‌ల మద్య జరిగిన చర్చలకు చంద్రబాబు నాయుడు ఎలా బాధ్యుడవుతారు?
- చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేందుకే ఈ కేసు విచారణ ప్రారంభించిన 22 నెలల తర్వాత ఆయన పేరుని నిందితుడుగా చేర్చిన్నట్లు భావిస్తున్నాం.
- ఈ 22 నెలల్లో చంద్రబాబు నాయుడు ఈ కేసు విచారణలో ఎన్నడూ జోక్యం చేసుకొన్నట్లు లేదా విచారణను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు. కనుక ఇప్పుడు బెయిల్ మంజూరు చేయవద్దనడానికి ఎటువంటి బలమైన కారణం కనిపించడం లేదు. కనుక బెయిల్ మంజూరు చేస్తున్నాము.
చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు విషయంలో ఏపీ హైకోర్టు ఏమీ తొందరపడలేదు ఈ కేసులో చాలా లోతుగా విచారణ జరిపిన తర్వాత ఇంత స్పష్టంగా హైకోర్టు తీర్పు చెప్పింది. కనుకనే ఆయన సుమారు రెండు నెలలు జైల్లో గడపాల్సి వచ్చింది.
కానీ చంద్రబాబు నాయుడుకి బెయిల్ లభించడం వైసీపి ప్రభుత్వానికి చాలా నిరాశ కలిగించి ఉంటుంది. కనుకనే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు ఏపీ సీఐడీ మంగళవారం పిటిషన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకొన్నప్పుడు, హైకోర్టు ఈవిదంగా తీర్పు ఇవ్వడం సరికాదని, హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో వాదించబోతున్నట్లు తెలుస్తోంది.
కోడికత్తి కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ కోర్టు తేల్చి చెప్పింది. అయినా ఏదో పెద్ద కుట్ర జరిగిందని వాదిస్తూ ఆ కేసును కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే ఈ కేసులో చంద్రబాబు నాయుడుకి ఎటువంటి సంబందమూ లేదని, ఆయనను అరెస్ట్ చేయడానికే ఏపీ సీఐడీ ఈ కేసులో ఆయన పేరు చేర్చిందని ఏపీ హైకోర్టు ఇంత స్పష్టంగా తీర్పు చెప్పినప్పటికీ, వైసీపి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళాలనుకొంటోంది. బహుశః సుప్రీంకోర్టు చేత కూడా మొట్టికాయలు వేయించుకొంటే గానీ తృప్తిగా ఉండదేమో?




