ఈడీకి గ్రీన్ సిగ్నల్‌… ఇక తవ్వకాలు మొదలవుతాయా?

AP Clears IAS Officer's Prosecution in Bharathi Cement Case

ఇప్పటికే జగన్‌ అక్రమాస్తులు, వివేక హత్య కేసులలో ఈడీ విచారణ జోరు పెంచింది. తాజాగా నాడు సమైక్య రాష్ట్రంలో పరిశ్రమలు, వాణిజ్యం, గనుల శాఖల కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి బి. కృపానందంను ప్రాసిక్యూట్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఈడీకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.

ఇదివరకే ఈడీ ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆయన ఆ పదవిలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా భారతీ సిమెంట్ కంపెనీకి లబ్ది కలిగించేందుకు మైనింగ్ లీజుల కేటాయింపులు జరిపారని ఈడీ ఆరోపిస్తోంది.

ADVERTISEMENT

ఆవిధంగా అక్రమ మైనింగ్ ద్వారా వచ్చిన భారీగా వచ్చిన నల్లదనాన్ని చట్టబద్ధంగా (వైట్‌ మనీ)గా మార్చేందుకు కృపానందం పరోక్షంగా సహకరించినందున ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.

తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ కేసులో కృపానందం నుంచి నిజాలు రాబట్టగలిగితే ‘అంతిమ లబ్దిదారు’ వరకు చేరుకోవడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినందున న్యాయపరమైన చర్యలకు మార్గం సుగమమైంది.

అయితే నాటి ఈ కేసుల మొదలు వివేకా హత్య కేసు, కల్తీ నెయ్యి, మద్యం కుంభకోణం, మద్యం రవాణా కుంభకోణం కేసుల వరకు ఏళ్ళ తరబడి విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటీ ఇంతవరకు కొలిక్కి రాలేదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి ‘ట్రిపుల్ ఇంజన్’ ఉపయోగిస్తున్నప్పుడు, కేసుల విచారణకు మాత్రం ఇంకా బొగ్గు ఇంజన్నే ఉపయోగిస్తున్నట్లు అనిపిస్తుంది.

దేశ, రాష్ట్ర సంపదను కొల్లగొట్టి రాజకీయాలు అడ్డం పెట్టుకొని తప్పించుకుంటున్న వారిని శిక్షలు విధించలేనప్పుడు సామాన్య ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోకుండా ఉంటుందా?

ADVERTISEMENT
Latest Stories