ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి నేడు పులివెందులలో పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం చాలా బాధాకరం.
“ఇప్పటికే నేను చొక్కా మడత పెట్టాను. పోలింగ్ బూత్‌కు వెళ్తాను. ఓటు వేస్తాను. నన్ను ఎవరు అడ్డుకుంటారో రండి.. చూస్తాను. నా కార్యకర్తలపై చెయ్యి వేస్తే నాపై వేసినట్లే భావిస్తున్నాను. ఎవరినీ సహించేది లేదు.
ఈ ప్రభుత్వం మరో మూడేళ్ళు మాత్రమే అధికారంలో ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది నేనే. మేము అధికారంలోకి రాగానే నా కార్యకర్తలపై చేయ్యేసిన ప్రతీ అధికారిపై చర్యలు తీసుకోవడం ఖాయం,” అని జగన్ హెచ్చరించారు.
అంటే పులివెందుల మున్సిపాలిటీ, కడప కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ రోజున జగన్ వేలాదిమందిని వెంటపెట్టుకొని రాబోతున్నానని, దమ్ముంటే తమని అడ్డుకోమని అయన పోలీసులకు కాదు… సిఎం చంద్రబాబు నాయుడుకి, స్థానిక టీడీపి నేతలకు సవాలు విసురుతున్నారని అనుకోవచ్చు.
జగన్ కంచుకోట కడపలో బద్వేల్, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, యెర్రగుంట్ల ఆరు మున్సిపాలిటీలు ఏకగ్రీవం అయ్యాయి. వాటిని టీడీపి, బిజేపిలు దక్కించుకున్నాయి.
ఏకగ్రీవాలు జరిగితే ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వనని వైసీపీ నేతలను హెచ్చరించిన జగన్, ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులను కూడా దక్కించుకోలేకపోతే పరువు పోతుంది.
చొక్కా మడత పెట్టి మహా సంగ్రామానికి సిద్దమవుతున్నానని జగన్ చెప్పేశారు కనుక కూటమి ప్రభుత్వం ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు.
లేకుంటే పులివెందుల మున్సిపల్ పోలింగ్ చరిత్రలో నిలిచిపోయే మరో చీకటి అధ్యాయంగా, అత్యంత దారుణమైన రోజుగా నిలిచిపోతుంది.





