దేశంలో సంక్షేమ పధకాలకు పేటెంట్ హక్కులు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అది జగన్మోహన్ రెడ్డికే ఇవ్వాల్సి ఉంటుంది. గత 5 ఏళ్లుగా అప్పులు చేసి మరీ ఆ హక్కుని కాపాడుకొస్తున్నారు. అది చూసి చంద్రబాబు నాయుడు కూడా ఆయనతో పోటీ పడక తప్పలేదు.
అందుకే బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో ఆరు హామీలు (పధకాలు) ప్రకటించారు. దీంతో సంక్షేమ రేసు మొదలైంది కనుక జగన్ కూడా వైసీపి మ్యానిఫెస్టోలో ఉన్న పధకాలకు భారీగా సొమ్ము పెంచి, మరిన్ని కొత్త పధకాలు ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈసారి సంక్షేమ పధకాల విషయంలో జగన్ వెనక్కు తగ్గడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పైగా పాత వాటినే కాస్త అటూ ఇటూ తిప్పి మళ్ళీ కొత్త అట్టతో ముద్రించిన్నట్లు కనిపిస్తున్నాయి.
ఉదాహరణకు జగన్ ప్రభుత్వం ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్ నెలకు రూ.3,000 చొప్పున ఇస్తోంది. కనుక టిడిపి మరో వెయ్యి రూపాయలు కలిపి నెలకు రూ.4,000 ఇస్తామని హామీ ఇచ్చింది. కనుక వైసీపి దానికి కనీసం మరో రూ.500 కలిపి నెలకు రూ.4,500 అయినా ప్రకటిస్తుందనుకుంటే, రూ.3,500కి పెంచుతామని చెప్పింది. అది కూడా ఇప్పుడు కాదు… 2028లో రూ.250, మళ్ళీ 2029లో మరో రూ.250 పెంచుతుందట.
అంటే అప్పటి వరకు నెలకు రూ.3,000 మాత్రమే ఇస్తామని చెప్పకనే చెప్పింది. వైసీపికి భారీ ఓటు బ్యాంక్ సృష్టించిన ఈ ముఖ్య పధకంలో జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో ప్రజలు నెలకు రూ.4,000 ఇస్తామంటున్న టిడిపికే మొగ్గు చూపుతారని జగన్‌కు తెలియదనుకోలేము. కానీ ఎందుకో వెనక్కు తగ్గారు.
వైసీపికి మంచి పేరు, బలమైన ఓటు బ్యాంక్ సమకూర్చిన మరో పధకం ‘అమ్మ ఒడి’. జగన్ ప్రభుత్వం ఈ పధకం కింద ఏడాదికి రూ.15,000 చొప్పున తల్లుల ఖాతాలో జమా చేస్తోంది. తాజా మ్యానిఫెస్టోలో దీనిని రూ.17,000కి పెంచింది. జగన్ ప్రభుత్వం దీనిని ఒక కుటుంబంలో ఒక పిల్ల/పిల్లాడి చదువు కోసం మాత్రమే పరిమితం చేసింది. దీనికీ అనేక ఆంక్షలు విధించి లబ్ధిదారుల భారం గణనీయంగా తగ్గించుకుంది.
ఇది చూసి టిడిపి ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకి వెళితే అంతమందికి ఏడాదికి రూ.15,000 చొప్పున చెల్లిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది. కానీ టిడిపితో పోటీ పడేందుకైనా జగన్ కూడా అమ్మ ఒడిని ఇంట్లో అందరూ పిల్లలకీ వర్తింపజేస్తారనుకుంటే మరో రెండు వేలు మాత్రమే పెంచి ‘మమ’ అనిపించేశారు.
వైసీపికి మంచి పేరు, బలమైన ఓటు బ్యాంక్ సృష్టించిన అతిముఖ్యమైన ఈ రెండు పధకాలలో జగన్ వెనకడుగు వేయడం వ్యూహాత్మకమని అనుకోవడానికి బలమైన కారణాలు ఏవీ కనబడటం లేదు. ఒకవేళ ఉన్నా ఈ వ్యూహం బెడిసి కొడితే నష్టపోయేది వైసీపియే. వైసీపి మ్యానిఫెస్టోలో ఈ రెండు మార్పులను నిశితంగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డికి సంక్షేమ పధకాలపై మోజు తగ్గిందా లేదా బుర్రలో మరో కొత్త ఆలోచన ఏమైనా పుట్టిందా? అనే సందేహం కలుగక మానదు.






