నేడు ఒంగోలు లో జరిగిన ముఖ్యమంత్రి జగన్ సభకు పలువురు వైసీపీ నేతలు హాజరు కాకపోవడంతో వీరంతా వైసీపీ నుంచి జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. జగన్ సిద్ధం సిద్దం అంటూ తిరుగుతుంటే పార్టీకి రోజుకో నేత రాజీనామాకి సిద్ధమవుతున్నారు.
ఈ రోజు ఒంగోలులో జగన్ ఇళ్ల పంపిణి కార్యక్రమంలో భాగంగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసారు ఆ పార్టీ నేతలు. అయితే ఈ కార్యక్రమానికి స్థానిక సిట్టింగ్ ఎంపీ గా ఉన్న మాగుంట శ్రీనివాస్ రెడ్డి, దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణు గోపాల్, కందుకూరి ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి , కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు , మాజీ మంత్రి శిద్దారాఘవరావు డుమ్మా కొట్టడంతో ప్రకాశం జిల్లా వైసీపీ లో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది.
సాక్ష్యాత్తు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి హాజరవుతున్న సభకు ఇంతమంది నాయకులు డుమ్మా కొట్టడంతో కారణాల పై ఆరా తీస్తున్నారు అధిష్టాన పెద్దలు. గత కొంతకాలంగా పార్టీకి పార్టీ అధిష్టానానికి దూరంగా ఉంటూ వస్తున్న మాగుంట శ్రీనివాస్ రెడ్డి టీడీపీ సైకిల్ ఎక్కడానికి గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారని త్వరలోనే అందుకు ముహూర్తం ఖరారు చేస్తారంటూ వస్తున్న వార్తలకు ఇప్పుడు బలం చేకూరినట్లయింది.
‘నేను బహిరంగ సభలలో బటన్ నొక్కుతాను మీరు పోలింగ్ బూతులో బటన్ నొక్కండి చాలు అంటూ ప్రజలకు పిలుపునిచ్చి పార్టీలోని నాయకుల గొంతు నొక్కుతున్నారు’ జగన్ అంటూ వాపోతున్నారు ఆ పార్టీలోని రెబల్ ఎమ్మెల్యేలు. తమ అభిప్రాయానికి కనీస విలువ కానీ గౌరవం కానీ పార్టీలో ఉండడం లేదంటూ ఆరోపిస్తున్నారు పార్టీని వీడుతున్న నాయకులు.
విలువలను పక్కన పెట్టి పక్క పార్టీల నేతలను బూతులు తిట్టినవాడికే తమ ఆశీస్సులు అంటూ ముందుకెళ్తున్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు నాయకులు టీడీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే పొత్తులో భాగంగా కొన్ని స్థానాలను వదులుకోవడానికి సిద్ధపడిన టీడీపీ వైసీపీ నుంచి బయటకు వస్తున్న నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా మరికొన్ని స్థానాలలో పార్టీ నేతలను త్యాగాలకు ఒప్పించాల్సి వస్తుంది.
అలాగే వైసీపీ పార్టీ తరుపున పోటీ చేసిన నర్సాపురం ఎంపీ రఘురామా కృష్ణం రాజు, మచిలీపట్నం ఎంపీ బాలసౌరి, నర్సరావుపేట లావు కృష్ణ దేవరాయలు, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు. అయితే వీరి జాబితాలోనే మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా చేరుతారనేది ప్రస్తుతానికి వైసీపీ లో హాట్ టాపిక్ గా మారింది.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరి సేవలను ఉపయోగించుకున్న జగన్ అధికారం రాగానే వీరిని పక్కన పెట్టేయడంతో చాల కాలం నుండి ఈ నేతలలో అసహనం పెరుగుతూ వచ్చింది.
ఆ అసహనమే రాజీనామాలకు కారణమయ్యింది అంటున్నారు ఆయా నేతలు. ఎంపీల రాజీనామాల లిస్ట్ అలా ఉంటే., పార్టీని వీడిన ఎమ్మెల్యే ల లిస్ట్….పార్థసారధి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వసంత కృష్ణ ప్రసాద్, గుమ్మనూరు జైరాం…..ఇలా రోజురోజుకి ఈ రాజీనామాల లిస్ట్ పెరుగుతూ పోతుంది.
ముందు డుమ్మా…తరువాత రాజీనామా…అంటూ వైసీపీ నాయకులు బయటకు వస్తుంటే వైసీపీ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే మాత్రం ముందు బూతులు, తరువాత ఆరోపణలు, ఆ తరువాత కించపరిచే వ్యాఖ్యలు….ఈ మూడు టెస్టులలో డిస్టెన్షన్ లో పాస్ అయ్యినవారికే వైసీపీ లోకి ఎంట్రీ అనేది కేశినేని ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ‘వైసీపీ నుంచి బయటకు రావాలంటే ఇలా…వైసీపీలోకి వెళ్లాలంటే అలా…అంతేగా..! అంతేగా’..! అంటున్నారు నాయకులు, ప్రజలు.




