మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచుకుందన్న విషయం తెలిసిందే. సినీ వర్గాలతో పాటు వెంకయ్య నాయుడు వంటి రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ఏపీ డీజీపీ సాంబశివరావు కూడా చేరిపోయారు. ‘శ్రీమంతుడు’ సినిమాకు తనకెంతో బాగా నచ్చిందని, ఆ సినిమాను తాను 70 సార్లు చూసి వుంటానని గుర్తు చేసుకున్నారు. చివర్లో జగపతిబాబు చెప్పే ఓ డైలాగును ఆయన తన నోటి నుంచి చెప్పి అక్కడున్న వారందరితో చప్పట్లు కొట్టించుకున్నారు.
“అందరూ వాడు పుట్టాడ్రా, వీడు పుట్టాడ్రా అంటారుగానీ, మంచోడు పుట్టాడ్రా నాకు” అన్న డైలాగ్ ను గుంటూరులో శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పోలీసు కుటుంబాల విద్యార్థులకు డీజీపీ ఉపకార వేతనాలు అందజేసిన సమయంలో పలికారు. విద్యార్థులు తమను తాము దిద్దుకోవాలని పిలుపునిచ్చారు. మత్తుకు తమ పిల్లలు బానిసలు కావడం పట్ల వారి తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉంటుందని అన్నారు. పోలీసులు సాధారణంగానే కఠినంగా ఉంటారని, వారి విధి నిర్వహణా బాధ్యతలు అటువంటివని, పోలీసులు తమ పిల్లల్ని మిగతావారికన్నా అత్యుత్తమంగా పెంచాలని పిలుపునిచ్చారు.


