ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి నక్సలైట్ల నుంచి ముప్పు పొంచి ఉన్నందున పర్యటనలలో భద్రత కోసం విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో ఒక హెలికాఫ్టర్ సిద్దంగా ఉంచాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే 20 కిమీ దూరానికి కూడా హెలికాఫ్టర్‌లో వెళ్ళివస్తున్నారు. కనుక ఇప్పుడు మరో రెండు హెలికాఫ్టర్లు ప్రభుత్వం అద్దెకు తీసుకొని రెండు చోట్ల ‘సిద్దం’గా ఉంచితే తప్పేమిటి?అని అనుకోవచ్చు.
అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు హెలికాఫ్టర్లను వాడుకొనేందుకు ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. కానీ వైసీపి అధినేత హోదాలో జగన్మోహన్ రెడ్డి వైసీపి కోసం ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేందుకు వాడుకోవడానికి ప్రజాధనంతో హెలికాఫ్టర్లను ఏర్పాటు చేసుకోవడాన్ని వైసీపి ఎంపీ రఘురామ కృష్ణరాజు సైతం అభ్యంతరం చెప్పుతున్నారు.
ఎన్నికలలో ప్రచారానికి ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ నేతలు హెలికాఫ్టర్లను అద్దెకు తీసుకొని వాడుకుంటారు. వాటికి ఆయా పార్టీలు చెల్లిస్తుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వాడుకోబోయే రెండు హెలికాఫ్టర్లకు నెలకు రూ.3.82 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించబోతుండటమే ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి.
వైసీపి ఎంపీ రఘురామ కృష్ణరాజు దీనిపై కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈసారి ఎన్నికలలో వైసీపికి ఓటమి తప్పదని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి, ఓటర్లకు పంచేందుకు హెలికాఫ్టర్‌లలో భారీగా నగదుని తరలించే అవకాశం ఉందని పిర్యాదులో పేర్కొన్నారు.
కనుక ఈ ప్రతిపాదనని తక్షణం విరమించుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని రఘురామకృష్ణరాజు ఈసీని కోరారు. ఎన్నికలలో జగన్ ప్రభుత్వం భారీగా అవకతవకలకు, దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉంది కనుక రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియని పరిశీలించేందుకు ఎన్నికల పరిశీలకులను నియమించాలని, ఎక్కడికక్కడ కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సంఘాన్ని ఆదేశించాలని రఘురామకృష్ణరాజు కోరారు.
జగన్ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని చెపుతూ పచ్చటి చెట్లను నరికించేస్తున్నారని టిడిపి, జనసేనలు ఆరోపించాయి. ఇప్పుడు పదవిలో నుంచి దిగిపోయే ముందు భద్రత సాకుతో ఖజానాని ఖాళీ చేసేయాలని చూస్తున్నారని టిడిపి, జనసేనలు ఆరోపిస్తున్నాయి.
ఎన్నికల ప్రక్రియకి వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల కమీషన్ హెచ్చరిస్తునప్పటికీ, సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు పట్టించుకోవడం లేదు. కనుక హెలికాఫ్టర్ల విషయంలో ప్రతిపక్షాల అభ్యంతరాలను జగన్మోహన్ రెడ్డి ఖాతరు చేస్తారనుకోలేము. కనుక కేంద్ర ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకుని వారించవలసి ఉంటుంది.




