ఏపీకి సముద్రమే పెద్ద వరం… చేపలు, పోర్టులు, పెట్టుబడులు!

Andhra Pradesh coastline with ports under APM investment plan

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 1,050 కిమీ పొడవైన సముద్రతీరం ఉంది. ఈ కారణంగా ఇప్పటికే ఆక్వా రంగంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. సముద్రంలో చేపలు మాత్రమే కాదు సముద్ర తీరాలు (బీచ్) పర్యాటక ఆకర్షణ కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఈ సముద్రం తీరం వెంబడి అనేక పోర్టులు ఉన్నాయి. కొత్తవి అనేకం నిర్మించ బడుతున్నాయి. కనుక సువిశాలమైన సముద్రతీరమే ఏపీకి అతి పెద్ద వరంగా మారబోతోంది.

ఏపీ మోల్లర్-మార్స్క్ (ఏపీఎం) కంపెనీ రూ.9,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ఈ మేరకు సిఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీఎం-ఏపీ మారిటైం బోర్డు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి.

ADVERTISEMENT

ఏపీఎం కంపెనీ రూ.9,000 కోట్లు పెట్టుబడితో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను అభివృద్ధి చేసి అక్కడ అత్యాధునిక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తుంది. అలాగే ఈ మూడు పోర్టుల నిర్వహణ బాధ్యత కూడా తీసుకుంటుంది.

ప్రస్తుతం తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, ఓడిశా రాష్ట్రాలు ఏపీలో పోర్టులను ఉపయోగించుకుంటున్నాయి. కనుక ఏపీఎం కేవలం పోర్టులకే పరిమితం కాకుండా ఈ మూడు పోర్టుల నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు సరుకు రవాణాకు వీలుగా రైలు, రోడ్ మార్గాల అభివృద్ధికి కూడా ప్రణాళికలు సిద్దం చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

ముఖ్యంగా ఈ మూడు పోర్టుల చుట్టూ ఉండే జిల్లాలు, ప్రాంతాలలో ఆర్ధికాభివృద్ధికి, భారీగా ఉద్యోగాల కల్పనకు దోహదపడేవిధంగా ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు.

భవిష్యత్తులో ప్రతీ 50-100 కిమీలకు ఒక పోర్టు నిర్మించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి దక్షిణాది రాష్ట్రాలలో ప్రధాన రవాణా కేంద్రంగా మార్చాలనుకుంటున్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఈ రంగంలో ఏపీఎం కంపెనీకి విశేష అనుభవం ఉంది కనుక దీని రాకతో ఏపీలో పోర్టులు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయి. మరిన్ని కొత్త పోర్టులు వచ్చే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories