నేటి సమకాలీన రాజకీయాలలో విలువైన రాజకీయాలు బరువైన నోటు చుట్టూ తిరుగుతూ తన బలాన్ని కోల్పోతూ తన బలహీతను బయటపెడుతున్నాయి. ఓటు అనే ఐదేళ్ల భవిష్యత్తు నోటు అనే ఐదు నిముషాల అవసరానికి అమ్ముకుంటూ తమ భవిష్యత్తు తో పాటు రాష్ట్ర భవిష్యత్తుని రాజకీయ పార్టీల ముందు తాకట్టు పెడుతున్నారు.
ఓటు విలువ తెలియకో, నోటు బరువు తెలిసో లేక తమ అవసరాల బలహీనతకు తలవంచో కొంతమంది ఓటర్లు రాజకీయ పార్టీల స్వార్ధ ప్రయోజనాలకు ఆకర్షితులవుతున్నారు. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఇచ్చే కొన్ని నోట్ల కాగితాలు తమ ఐదేళ్ల భవిష్యత్తుని నిర్దేశిస్తాయనే కనీస ఆలోచన కూడా లేకుండా తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగానే రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో, కొండంత అప్పులతో ఓటమికి గెలుపుకి మధ్య ఉగిసలాడుతుంది.
కోడి ముందా…గుడ్డు ముందా అన్నట్లుగానే ఓటుకు నోటా…నోటుకి ఓటా…అంటే దానికి సమాధానం వెతకడం వెర్రితనమే అవుతుంది. అవును నోటు బరువైనదే కానీ ఓటు విలువైనది. దాని బలాన్ని మన బలహీనత కోసం వదులుకోకూడదు. ఒక్క ఓటుతో మనం ఏం చెయ్యగలం అనుకుంటే అది ఓటరు అమాయకత్వమే అవుతుంది. ఒక్క ఓటుతో ప్రభుత్వాలే తారుమారైన సంఘటనకు దేశ పార్లమెంట్ సాక్షిగా నిలిచింది.
1999 ఏప్రిల్ 17 న పార్లమెంట్లో నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో ఒక్క ఓటు తేడాతో బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కేవలం తనకున్న రాజకీయ విలువలకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని, ప్రధాని పదవిని వదులుకున్నారు అప్పటి బీజేపీ నేత దేశ ప్రధాని అటల్ బిహారి వాజ్ పై. దీనితో ఒక్క ‘ఓటు బలమెంతో’ అన్ని రాజకీయ పార్టీలతో పాటు దేశప్రజలందరికి తెలిసొచ్చింది.
గత పాలకులు ఓటు బలమెంతో ప్రజలకు తెలియచేస్తే ఇప్పటి పాలకులు నోటు బరువెంతో ప్రజలకు సాక్ష్యాత్కరింపచేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని ప్రాంతాలలో తమ ప్రత్యర్థుల ఓటమి కోసం ఓటు అనే విలువైన బలాన్ని నోటు అనే బరువైన తూకంలో వేసి కొనడానికి సిద్ధమవుతున్నారు అధికార పార్టీ నేతలు అంటూ ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఒక్కో ఓటుకు 5 నుంచి 10 వేలు కూడా ఇవ్వడానికి కూడా అధికార పార్టీ నేతలు వెనుకాడడం లేదు అంటూ పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గాల పేర్లు గట్టిగా వినపడుతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల ప్రజలకు నోటు బరువెంతో తెలియచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అధికార పార్టీ నేతలు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలతో ఓటు బలమైనదా..? నోటు బరువైనదా..? తేలనుంది.
క్లుప్తంగా చెప్పాలంటే ఓటు బలమెంత అంటే ఐదేళ్ల భవిష్యత్తు…నోటు బరువెంత అంటే ఐదు నిముషాల అవసరం. ఈ అవసరాల కోసం ఐదేళ్ల భవిష్యత్తుని ఏ రాజకీయ పార్టీల నేతల ముందు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏ ఓటరుకి లేదు అనేది తెలుసుకోగలిగిననాడు ఓటు బలం పెరుగుతుంది నోటు బరువు తగ్గుతుంది. వాటి ఫలితంగా విలువలతో కూడిన రాజకీయాలు…జవాబుదారితో కూడిన ప్రభుత్వాలు…బాధ్యతతో కూడిన పాలకులు చట్టసభలలో అడుగుపెడతారు.






