బిఆర్ఎస్ పార్టీకి మజ్లీస్ తలాక్… కాంగ్రెస్‌తో నిఖా?

Asaduddin Owaisi Supports Revanth Reddy

తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే ఆ పార్టీలో నుంచి కాంగ్రెస్‌, బీజేపీలలోకి వలసలు మొదలైపోయాయి. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుదామని ఆరాటపడిన కేసీఆర్‌, సరిగ్గా కాలు కదపలేక రాష్ట్రంలో కూడా తిరగలేకపోతున్నారు.

మరోపక్క మాజీ మంత్రులు హరీష్ రావు బీజేపీలో, మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే గుసగుసలు కేసీఆర్‌కి తీవ్ర ఆందోళన కలిగిస్తుండవచ్చు.

ADVERTISEMENT

ఈ పరిస్థితులలో బీఎస్పీ అధినేత ప్రవీణ్ కుమార్‌ స్వయంగా కేసీఆర్‌ ఇంటికి వచ్చి కలిసి పనిచేద్దామని ప్రతిపాదించడం చాలా ఉపశమనం కలిగించేదే కనుక వెంటనే ఓకే చెప్పేశారు. కానీ శాసనసభ ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన బీఎస్పీతో పొత్తు వలన బిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు.

కేసీఆర్‌ కొత్త దోస్తీ కోసం లెక్కలు కట్టుకొంటుంటే, మరోపక్క నమ్మకమైన పాత దోస్త్ మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ బిఆర్ఎస్ పార్టీకి తలాక్ చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో నిఖాకు సిద్దమైపోయారు.

శుక్రవారం సిఎం రేవంత్‌ రెడ్డి పాతబస్తీలో మెట్రో-2 కారిడార్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయనకు మజ్లీస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సాదరంగా స్వాగతం పలికి “మీ ప్రభుత్వం ఖచ్చితంగా 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. తెలంగాణ అభివృద్ధిలో మీ ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా సహకరిస్తాము. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్న బీజేపీని కలిసి తిప్పికొడదాం,”అంటూ ఓవైసీ మనసులో మాట చెప్పేశారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కేసీఆర్‌ పదేళ్ళపాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌లో పాతబస్తీకి కూతవేటు దూరంలోనే ఉన్నా ఏనాడూ అక్కడకు వెళ్ళలేదు. కానీ రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే పాతబస్తీకి వెళ్ళడమే కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేసి, శంకుస్థాపన చేసి మజ్లీస్‌, ముస్లిం ప్రజల మనసులను గెలుచుకున్నారు.

దాంతో పాటు మజ్లీస్‌ పార్టీని తమవైపు తిప్పుకొని తన ప్రభుత్వానికి ‘సెక్యూరిటీ కవర్’ కూడా సిద్దం చేసుకున్నారు. తద్వారా తాను కాంగ్రెస్‌కు అన్ని విధాలా ‘సరైనోడు’నని రేవంత్‌ రెడ్డి నిరూపించుకున్నారు. కనుక కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు మరింత ప్రాధాన్యత ఇస్తుంది. కాంగ్రెస్‌, మజ్లీస్‌ దోస్తీతో లోక్‌సభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునేలా రేవంత్‌ రెడ్డి చేస్తే ఇక ఆయనకు తిరుగే ఉండదు.

‘రేవంత్‌ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉండేందుకు అండగా నిలబడతానని ఓవైసీ భరోసా ఇస్తున్నారు కనుక కేసీఆర్‌ ఆయన ప్రభుత్వం వైపు ఇక కన్నెత్తి చూడలేని పరిస్థితి నెలకొంది.

మజ్లీస్‌, కాంగ్రెస్‌ పార్టీలు చేతులు కలిపితే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ లాభపడుతుంది. వాటిని బూచిగా చూపిస్తూ బీజేపీ కూడా హిందూ ఓట్లను నొల్లేసుకుంటుంది. ఈ నేపధ్యంలో ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ ఇంకా వేగంగా ఖాళీ అయిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది.

ఈ విపత్కర పరిస్థితులలో మళ్ళీ మోడీ, అమిత్ షాలతో చేతులు కలుపుదామనుకున్నా, వారిరువురూ చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపబోతున్నారు. కనుక కేసీఆర్‌కి ఢిల్లీ తలుపులు కూడా మూసుకుపోయిన్నట్లే!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మారిన ఈ రాజకీయ సమీకరణాల కారణంగా కేసీఆర్‌తో పాటు జగన్‌కు కూడా కష్టకాలం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories