ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం పర్యటిస్తున్నప్పుడు ఆయనను అడ్డుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. మంత్రే వారిని ప్రోత్సహించడంతో వారు రెచ్చిపోయి చంద్రబాబు నాయుడుపై రాళ్ళతో దాడి చేశారు. వెంటనే ఎన్ఎస్‌జీ కమాండెలు తమ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ఆయన చుట్టూ అడ్డంపెట్టి రాళ్ళు తగలకుండా కాపాడారు. కానీ వైసీపీ కార్యకర్తల దాడిలోఎన్ఎస్‌జీ కమాండెంట్ సంతోష్ కుమార్ గాయపడ్డారు. ఆయన తలకి మూడు కుట్లు పడ్డాయి.
చంద్రబాబు నాయుడు యర్రగొండపాలెంలో అడుగుపెట్టకుండా అడ్డుకొంటానని మంత్రి ఆదిమూలపు సురేష్ మధ్యాహ్నమే తన క్యాంప్ కార్యాలయం వద్ద విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. స్వయంగా నల్ల దుస్తులు ధరించడమే కాకుండా అందరూ నల్ల దుస్తులు ధరించి, నల్ల బెలూన్లు పట్టుకొని నిరసనలు తెలపాలని అనుచరులను ఆదేశించారు. తర్వాత మీడియా ప్రతినిధులు, ప్రజలు, పోలీసుల ఎదుటే ఆయన చొక్కా విప్పేసి చంద్రబాబు నాయుడు యర్రగొండపాలెంలో ఎలా అడుగుపెడతారో నేనూ చూస్తానంటూ సవాలు చేశారు.
మంత్రిగా హుందాగా వ్యవహరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఆదిమూలపు సురేష్ ఈవిదంగా వ్యవహరించడంతో ఆయన అనుచరులు కూడా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడి కాన్వాయ్ సాయంత్రం యర్రగొండపాలెంలో ప్రవేశించినప్పుడు రాళ్ళతో దాడి చేశారు. దాంతో తీవ్ర ఆగ్రహించిన చంద్రబాబు నాయుడు మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద తన కాన్వాయ్ ఆపించి ‘కబడ్దార్’ అంటూ హెచ్చరించారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ తన అనుచరులను చంద్రబాబు నాయుడుపైకి ఉసిగొల్పి దాడి చేయించే ఆలోచనలో ఉన్నారని, కనుక తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు పర్యటన సజావుగా సాగేందుకు సహకరించాలని, ఆయనకి రక్షణ కల్పించాలని టిడిపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ కు ముందే ఫోన్ చేసి, వాట్సప్ మెసేజుల పంపి అభ్యర్ధించారు.
చట్టాన్ని గౌరవించాల్సిన మంత్రే ఈవిదంగా అనుచరులను ఊసుగొల్పి ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవాలని రెచ్చగొట్టడం ఏమిటని వర్ల రామయ్య ప్రశ్నించారు. కానీ టిడిపి నేతలు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేసినప్పటికీ వారు మంత్రి, ఆయన అనుచరులను అడ్డుకొనే సాహసం చేయలేకపోవడంతో ఈ దాడి జరిగిందని చెప్పవచ్చు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శుక్రవారం నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడా వైసీపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకొనేందుకు ప్రయత్నించగా, ఇక్కడ ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూలపు అనుచరులు చంద్రబాబు నాయుడుపై రాళ్ళతో దాడి చేశారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?అన్నట్లు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఎవరూ సభలు, రోడ్ షోలు చేసుకోకుండా అడ్డుకొనేందుకు వైసీపీ ప్రభుత్వమే జీవో నంబర్:1 తీసుకురాగా, మంత్రులే ఈవిదంగా కార్యకర్తలను ప్రతిపక్ష నేతలపై దాడులకు ఉసిగొల్పుతున్నారు. అధినేత జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి చొక్కాలు చించేసుకొన్నా, చంద్రబాబు నాయుడుపై రాళ్ళ దాడి చేయించినా వచ్చే ఎన్నికలలో టికెట్ ఇస్తారా అంటే గ్యారెంటీ లేదని గ్రహిస్తే మంచిది!



