ఓవల్ వేదికగా భారత్ X ఆస్ట్రేలియా మధ్య జరిగిన పోరులో అన్ని విభాగాల్లో పై చేయి సాధించిన టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే. టీమిండియా నిర్దేశించిన 353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసిస్ 50 ఓవర్లకు 316 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. అయితే మ్యాచ్ సందర్భంగా ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా ప్రవర్తనతో టాంపరింగ్ సందేహాలు రేకెత్తించాడు. తన తొలి స్పెల్ బౌలింగ్ చేస్తున్న సమయంలో అతను పదే పదే ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టి తీయడం, తర్వాత బంతిని రుద్దడమే ఈ సందేహాలకు కారణం.
టీవీ తెర మీద కనిపించిన ఈ దృశ్యాలు ఆ తరువాత సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. జంపా తీరు అనుమానాస్పదంగా ఉందని, దీనిపై ఐసీసీ దృష్టిసారించాలని నెటిజన్లు పలువురు అభిప్రాయపడ్డారు. జంపా కచ్చితంగా టాంపరింగ్‌కు పాల్పడ్డాడని చెప్పేలా ఆ దృశ్యాలు లేవు. అయితే ఏడాది కిందట జరిగిన బాల్‌టాంపరింగ్ ఉదంతంతో ఈ సారి కూడా అటువంటి పని దేనికైనా పూనుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే కొందరు మాత్రం స్మిత్, వార్నర్ ను ఆ దేశపు బోర్డు శిక్షించిన తీరుతో ఇకపై ఆ జట్టు ఆటగాళ్లెవరైనా టాంపరింగ్ గురించి ఆలోచన అయినా చేస్తారని అనుకోలేం అని అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా వరుసగా రెండు విజయాలతో మంచి ఊపు మీద ఉన్న టీమిండియా తన తరువాతి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది. గురువారం ఈ మ్యాచ్ జరగబోతుంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి ఉత్సాహంగా ఉరకలు వేస్తుంది.



