avanthi-srinivasa-rao-ysrcp

జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో సేద తీరుతూ పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, ధర్నాలు, దీక్షలు చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని హుకుం జారీ చేశారు. జగన్‌ ధోరణిని ప్రతిపక్షాలు, మీడియా మాత్రమే కాదు.. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తప్పు పడుతున్నారనే విషయం ‘ఎం9 న్యూస్’ కూడా చెప్పింది.

ధర్నాలు, దీక్షలు చేయాలంటే మొదట అధినేత, ఆయన వెంట నేతలు ముందుండి నడిపించాలి. జేబులో నుంచి డబ్బు తీసి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ధర్నాలు చేస్తున్న కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తే వారికి బెయిల్ ఇప్పించి విడిపించుకోవాలి.

Also Read – సైఫ్‌కి టాలీవుడ్‌ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?

ఒకవేళ వారు జైలుకి వెళ్ళినా, బెయిల్ లభించకపోయినా వారి కుటుంబాలకు అండగా నిలబడాలి. అప్పుడే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకు వస్తారు.

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవిదంగానే కార్యకర్తలని కంటికి రెప్పలా కాపాడుకుంది. అందుకే వారు కూడా కేసులు, వేధింపులకు భయపడకుండా జగన్‌ ప్రభుత్వంతో ధైర్యంగా పోరాడారు.

Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్‌ విధ్వంసానికి…

కనుక తమ అధినేత జగన్‌ కూడా ఆ విదంగా తమకు అన్ని విదాలా అండగా నిలబడాలని వైసీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ వారిని కలిసేందుకు కూడా జగన్‌ ఇష్టపడటం లేదు. పైగా ‘మీరు కష్టపడి పని చేస్తుండండి.. నేను సంక్రాంతి పండుగ చేసుకున్నాక బయటకు వస్తానని’ చెపుతున్నారు!

“పార్టీని కాపాడుకోవాలని అధినేతకే శ్రద్ద లేనప్పుడు మేమెందుకు పోరాడాలి?మేము జైలుకి వెళితే మా కుటుంబాలకు దిక్కెవరు?” అని వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

Also Read – ఈ విజ్ఞప్తిపై చంద్రబాబు ఆలోచించడం అవసరమే!

నేడు వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ కూడా సరిగ్గా ఇదే చెప్పారు. “ఆనాడు లండన్ నుంచి ఆదేశాలు వస్తే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వాటిని అమలుచేసేవారు. అలాగే జగన్‌ కూడా తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని మాకు, కార్యకర్తలకు ధర్నాలు, దీక్షలు చేయమని ఆదేశాలు జారీ చేస్తూ అమలుచేయమని ఒత్తిడి చేస్తున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కార్యకర్తలను జగన్‌ పట్టించుకోలేదు. పైగా పార్టీ కార్యక్రమాల ఒత్తిడి ఎప్పుడూ ఉండేది. అప్పుడే వారు బాగా నలిగి అలిసిపోయున్నారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా వారిని నలిపేయాలని అనుకోవడం సరికాదు.

కార్యకర్తలు అందరూ నిరు పేద కుటుంబాల నుంచి వచ్చినవారే. వారు పనులు మానుకొని ధర్నాలు, దీక్షలు చేస్తుంటే వారి కుటుంబాలను ఎవరు పోషిస్తారు?వారిపై పోలీసులు కేసులు పెట్టి జైలుకి పంపిస్తే ఎవరు విడిపిస్తారు? విడిపించకపోతే వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి?

జగన్‌ మాటలు నమ్మి వైసీపీ సోషల్ మీడియాలో కొందరు ఇలాగే రెచ్చిపోతే ఏమైంది? జైల్లో పడ్డారు. వారికి జగన్‌ బెయిల్ ఇప్పించి బయటకు తెచ్చారా? వారి కుటుంబాలను ఆదుకున్నారా?”అని అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు.

“నేతలు, కార్యకర్తలు పోరాడాలంటే ముందు జగన్‌ ప్యాలస్‌లో నుంచి బయటకు వచ్చి ముందుండి పోరాడాలి. అయినా కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా 6 నెలలు కాకముందే ప్రభుత్వాన్ని నిలదీస్తామంటే ఎలా?

ఇదివరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే మీడియా, ప్రతిపక్షాలు నిలదీస్తే, “అవును హామీలు ఇచ్చాము. వాటిని అమలు చేయడానికి ప్రజలు మాకు 5 ఏళ్ళ సమయం ఇచ్చారు. అంతవరకు వాటి గురించి ఎవరూ మమ్మల్ని ఆడగలేరు,” అని చెప్పారు కదా?మరి జగన్‌కి ఈ విషయం తెలియదా?” అని ప్రశ్నించారు.

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్ధంగా రాష్ట్రాన్ని పాలించలేకపోయారు. అధికారం కోల్పోయాక సరిగ్గా పార్టీని నడిపించలేకపోతున్నారు. అందుకే విజయమ్మకి పార్టీ బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని చెల్లి వైఎస్ షర్మిల చక్కటి సలహా ఇచ్చారు కూడా.