సామాన్య ప్రజల విషయంలో న్యాయం ధర్మం చాలా అరుదుగా గెలుస్తుంటాయి. కానీ రాజకీయ నాయకుల విషయంలో మాత్రం ప్రతీసారి న్యాయం ధర్మం గెలుస్తూనే ఉంటాయి.
ఒకవేళ గెలవకపోతే గెలిచే వరకు కేసులు నడిపిస్తూనే ఉంటారు. చివరికి న్యాయదేవత, న్యాయమూర్తులు కూడా అలిసిపోయి వారి కోసం న్యాయం ధర్మాన్ని గెలిపిస్తుంటారు. చివరికి అందరూ కడిగిన ఆణి ముత్యాల్లా బయటపడుతుంటారు.
అప్పుడు అసమదీయుల చేత జేజేలు కొట్టించుకుంటారు. తసమదీయులు మాత్రం ‘బెయిల్‌పై బయట ఉన్నారు’ వంటి వంకర టింకర మాటలు మాట్లాడుతూ న్యాయ దేవతని అవమానిస్తుంటారు.
అయితే ఈ న్యాయం ధర్మం గెలుపు అంత సులువైన ప్రక్రియ కాదు. దాని కోసం ప్రత్యేకమైన ఫార్ములా ఉంది. దాని ప్రకారం ముందుకు సాగాలి.
ఈ ఫార్ములలో ముందుగా కేసులు పడితే అవి రాజకీయ మెడల్స్ కింద లెక్క. విచారణకు హాజరయితే అధికార పార్టీ వేధింపులకు నిదర్శనం.
రేప్, హత్య కేసులలో జైలుకి వెళితే సమాజం దృష్టిలో నేరస్తుడు… కానీ అవినీతి కేసులలో జైలుకి వెళితే స్వాతంత్ర సమరయోధుల కిందే లెక్క!
అలాగని ఇప్పుడు ఎవరూ అండమాన్ జైలుకి వెళ్ళడం లేదు కనుక ఇంటి నుంచి టిఫినీలు, కాఫీలు, టీలు సప్లై మామూలే. ఇదేమీ మామూలు త్యాగం కాదు కనుక జైల్లో న్యూస్ పేపర్లు, జాగింగ్ షూస్, యోగా మ్యాట్స్ వంటివి కూడా తప్పనిసరి.
బెయిల్‌పై బయటకు వస్తే అంతరిక్ష కేంద్రం నుంచో లేదా అంటార్కిటికా నుంచి అప్పుడే డైరెక్టుగా తిరిగి వచ్చారన్నట్లు అనుచరులు మేళతాళాలతో స్వాగతం పలికి ఊరేగింపుగా గూటికి చేర్చుతారు.
కనుక బెయిల్‌పై బయటకు వస్తే చాలు… నాయం ధర్మం గెలిచేసినట్లే.. కేసు గెలిచేసినట్లే… కొట్టేసినట్లే లెక్క! ఆ తర్వాత అధినేతని కలిసి జైలు విశేషాలు కలబోసుకున్నాక మళ్ళీ రొటీన్‌లో పడిపోతారు.
కనుక దీనిలో నీతి ఏమిటంటే, మన దేశంలో హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు జరుగుతున్న మాట వాస్తవం. వాటికి శిక్షలు పడుతున్నమాట కూడా వాస్తవం.
కానీ దేశంలో ఎక్కడా అవినీతి, అక్రమాలు జరగడం లేదు. అందుకే న్యాయం ధర్మం పదేపదే గెలిచేస్తుంటాయి. సత్యమేవ జయతే! హ్యాపీ?




