బాబాయ్, అబ్బాయ్ అంటే కొందరికి బాలయ్య, జూ.ఎన్టీఆర్ గుర్తుకొస్తారు… కొందరికి జగన్, వివేకానంద రెడ్డి గుర్తుకొస్తారు. తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల వలన ఈ బాబాయ్-అబ్బాయి, మావయ్య-మేనల్లుళ్ళ కాంబినేషన్స్ చాలా పాపులర్ అయ్యాయి. కారణాలు అందరికీ తెలిసినవే. కనుక ఇప్పుడా చర్చ అనవసరం.
రాజకీయాల వలన బాలయ్య, జూ.ఎన్టీఆర్ మద్య దూరం ఏర్పడటంతో, వారు కూడా ఆ డిస్టెన్స్ అలాగే మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. కానీ వారిద్దరినీ ఈనాడు దినపత్రిక కలిపింది!
వారిద్దరూ పాపులర్ సినీ నటులే. కనుక ఇద్దరూ రెండు వేర్వేరు సంస్థల వాణిజ్య ప్రకటనలలో నటించారు. ఆ రెండు బంగారు ఆభరణాల సంస్థలే కావడం విశేషం. బాలకృష్ణ వెగా జ్యూవెలర్స్‌కు చేయగా, జూ.ఎన్టీఆర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యూవెలర్స్ వాణిజ్య ప్రకటనలో నటించారు.
త్వరలో దీపావళి, దంతేరస్ పండుగల సందర్భంగా వారిరువురు చేసిన ఆ వాణిజ్య ప్రకటనలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నాయి. చిరకాలంగా దూరంగా ఉన్న బంగారం వంటి ఆ ఇద్దరు నటులను ఈనాడు పత్రిక కలిపింది.
అదెలా అంటే, ఈరోజు ఈనాడు పత్రిక మొదటి పేజీలో వారిరువురి ఫొటోలతో ఉన్న వాణిజ్య ప్రకటనలు పక్కపక్కనే అచ్చు వేసింది.
ఇది నందమూరి అభిమానులను, సినీ ప్రియులను, సామాన్య ప్రజలను కూడా ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో అప్పుడే ఇది వైరల్ అవుతోంది.
చిరంజీవి సినిమాలో వెంకటేష్, రజనీకాంత్, ధనుష్ సినిమాలలో నాగార్జున కనిపిస్తుంటారు. ఎప్పటికైనా ఈ బాబాయ్-అబ్బాయ్ కలిసి నటిస్తే చూడాలని నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వారి కోరిక ఎప్పటికైనా తీరుతుందో లేదో తెలీదు కానీ ఈనాడు పత్రిక వారిద్దరినీ ఈవిదంగా కలిపింది.




