టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత తనదైన శైలిలో రాణిస్తున్నారు. వ్యవహార సరళిలోనే కాక మాట తీరులోనూ గణనీయమైన మార్పు బాలయ్యలో కనిపిస్తోంది. గతంలో సినీ రంగాన్ని శాసించిన తండ్రి, దివంగత మాజీ సీఎం నందమూరి తారకరామారావు ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు’ అంటూ వ్యాఖ్యానించేవారు.
తండ్రి బాటలోనే పయనిస్తున్న బాలయ్య కూడా… తొలి యత్నంలోనే తన తండ్రిని గెలిపించిన అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి, మిగిలిన ఎమ్మెల్యేల మాదిరి కాలయాపన చేయకుండా నియోజకవర్గ అభివృద్దిపై నిత్యం ఆలోచనలు చేస్తూ ఇటీవలే లేపాక్షి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు బాలయ్య.
తాజాగా శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలకు వెళ్లిన బాలయ్య, స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలయ్య నోట ఎన్టీఆర్ అన్న మాట వినిపించింది. ‘సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుత సాంకేతిక అభివృద్ధికి వేదాలే మూలమని కూడా బాలయ్య వ్యాఖ్యానించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని బాలయ్య అభిప్రాయ పడ్డారు.



