వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరావు కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. మొన్నటికి మొన్న వచ్చే ఎన్నికలలో టీడీపీ విజయం సాధిస్తే మన పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలి అంటూ వైసీపీ పార్టీ ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
తాజాగా ప్రకాశం జిల్లా భూకబ్జాలు విషయంలో నియమించిన సిట్ అధికారులు కానీ, జిల్లా ఎస్పీ కానీ,ఇతర పోలీస్ అధికారులు కానీ నిందుతులెవరో తాను చెప్తున్నా తనను, తన మాటను ఎవరు పట్టించుకోలేదని, అసలైన నిందితులను అరెస్టు చేయలేదంటూ అసహానికి గురై తన గన్ మెన్లను వెనక్కి పంపించిన వైనం ఇప్పుడు వైసీపీ పార్టీలో చర్చనీయాంశం అయ్యింది. కొద్దిరోజుల నుండి బాలినేని వైఖరితో పార్టీ అధిష్టానం, పార్టీ అధిష్టానం పై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో బాలినేని పంచాయితీ పరిష్కారం తాడేపల్లి పాలస్ కి చేరింది. కర్నూల్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమం పూర్తి చేసుకుని పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలను తిరిగి గాడిలో పెట్టడానికి మరి ఏ బట్టన్ నొక్కుతారో వేచిచూడాలి. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత కోటం రెడ్డి వైసీపీ పార్టీకి వీడ్కోలు పలికి సైకిల్ ఎక్కారు. బాలినేని కూడా పార్టీ మారతారు అంటూ చాలాకాలంగా గుసగుసలు వినపడుతున్నాయి.
బాలినేని విషయంలో వైసీపీ అధిష్టానం కోటం రెడ్డి మాదిరి తప్పుడు నిర్ణయాలు తీసుకునే సాహసం చేయలేకే ఇలా తాడేపల్లిలో పంచాయితీకి సిద్ధమయ్యారు అంటూ మీడియాలో చర్చ ఊపందుకుంది. ఇక బాలినేనిని జగన్ బుజ్జగిస్తారా? బెదిరిస్తారా? బయపెడతారా?అనేది బాలినేని తదుపరి కార్యచరణ పై ఆధారపడి ఉంటుంది. ఈ వైసీపీ నేతల పంచాయితీలు ఇక్కడి నుంచి మొదలా? ఇక్కడితో ముగింపా? అనే ప్రశ్నకు కాలమే బదులివ్వాలి.




