తెలంగాణాలో మహాకూటమి అధికారంలోకి రాకపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో తన మెడ కోసుకుంటా అని ఛాలెంజ్ చేసిన నిర్మాత తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ ఆ తరువాత మీడియా నుండి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈరోజు ఆయన తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం వచ్చారు. దర్శనం అనంతరం మీడియాకు చిక్కారు బండ్ల గణేష్. దీనితో ఆయన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది మీడియా.
[m9ad]
“అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం అంటూ ఏమీ లేదు… ఏదేదో ఊహించుకున్నాం అది జరగలేదు అందుకే బాధతో రెండు మూడు రోజులు బయటకు రాలేదు. మౌనంగా ఉందామని అనుకున్నా. 100 అంటాం (మెడ కోసుకోవడంపై) చాలా మంది చాలా అంటారు అవన్నీ అవుతాయా? ఏదో మావాళ్ళకు ఉత్సాహం తేవడానికి అన్నా… ఇవన్నీ మాములే… మీరు చెప్పండి కోసుకోమంటే కోసుకుంటా… కాంఫిడెన్స్ కాస్త ఓవర్ కాంఫిడెన్స్ అయ్యింది… దానికి ఇప్పుడేం చెప్తాం?,” అన్నారు బండ్ల గణేష్.
ఇటీవలే జరిగిన ఎన్నికలలో తెరాస విజయదుందుభి మోగించింది. 119 సీట్లకు గానూ 88 సీట్లు గెలిచింది తెరాస. మహాకూటమి కేవలం 21 సీట్ల తో అధికారానికి చాలా దూరంగా ఉండిపోయింది. కాంగ్రెస్ కు కేవలం 19 సీట్లు మాత్రమే వచ్చాయి. తెలుగు దేశం పార్టీ కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీకి ఒకే సీటు లభించింది. మహాకూటమి పక్షాలైన సిపిఐ, తెలంగాణా జన సమితి పార్టీలు కనీసం ఖాతా కూడా తెరుచుకోలేదు. దీనితో ఈ షాక్ నుండి ఇంకా కోలుకోనేలేదు ప్రతిపక్షాలు.



