తెలంగాణాలో సెంచరీ కొట్టిన తెరాస

Beeram Harshavardhan Reddyతెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఒక్కొక్కరిగా ఆ పార్టీకి ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలు అధికార తెరాసలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌ రెడ్డి ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరిపోయారు. కొల్లాపూర్‌ నియోజకవర్గం అభివృద్ధికి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ నుండి వరుసగా చేరికలు ఉండడంతో శాసనసభలో తెలంగాణ రాష్ట్ర సమితి బలం 100కి చేరింది.

నామినేటెడ్‌ ఎమ్మెల్యేతో కలిపి 101 ఉంది. మరో నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడినట్లయితే అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా పోతుంది. మరోవైపు మరో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమతో చర్చలు జరుపుతున్నారని అధికార పార్టీ చెబుతోంది. నాలుగు నెలల క్రితం తెలంగాణాలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కనిపించకుండా ఉన్న ఈ నాయకులకు ఎన్నికల ఫలితాల తరువాత బంగారు తెలంగాణ స్వప్నం కనిపించడం, అది కేసీఆర్ ఒక్కరి వల్లే సాధ్యం అనిపించడం విశేషం.

ADVERTISEMENT

పార్లమెంట్ ఎన్నికలకు ఇంకో మూడు వారాలు కూడా లేని ఈ సమయంలో ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కరిగా పార్టీ నుండి వెళ్లిపోవడంతో కాంగ్రెస్ పార్టీలో అయోమయం ఎక్కువైంది. సీనియర్ నాయకురాలు డీకె అరుణ కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరడం విశేషం. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పైన బీజేపీ వస్తుందని ఆమె చెప్పకనే చెప్పింది. లేకపోతే తెలంగాణాలో ఏ మాత్రం ప్రభావం చూపించే అవకాశం లేని బీజేపీలో చేరడం ఏంటి? దీనితో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ గుండు సున్నా తెచ్చుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు.

ADVERTISEMENT
Latest Stories