బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు చిత్రానికి సర్వత్రా ప్రశంసలు అందడంతో ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ ఆనందానికి అవధులు లేవు. టాక్ కి తగ్గ కలెక్షన్లు లేకపోయినా హిట్ అని ఫిక్స్ అయిపోయారు. బెల్లంకొండ నటించిన స్పీడున్నోడు, కవచం లాంటి చిత్రాల హిందీ వర్షన్స్ యూట్యూబ్ లో 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతున్నాయి అన్నారు. నార్త్ ఇండియా లో అత్యంత ప్రజాదరణ కలిగిన సౌత్ స్టార్స్ లో బెల్లంకొండ ఒకరని అన్నారు.
తెలుగులో అయితే ఎవరైనా మా అబ్బాయి తరువాత అన్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. ఇదే సంధర్బములో శ్రీనివాస్ తో ఆయన ఓ హిందీ చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించారు. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మా అబ్బాయితో సినిమా చేస్తామని, మమ్మల్ని కలవడానికి హైదరాబాద్ వస్తామని చెబుతూ మెయిల్ పంపారని, ఒకవేళ బాలీవుడ్ నిర్మాతలతో సినిమా వర్కవుట్ కాకపోతే, తెలుగులో విజయవంతమైన ఓ చిత్రాన్ని బాలీవుడ్‌లో నేనే నిర్మాతగా మారి రీమేక్ చేయాలనుకుంటున్నాను అని కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు ఆయన.
అయితే ఇది చాలా ఓవర్ గురు అంటున్నారు సోషల్ మీడియాలోని నెటిజెన్లు. యూట్యూబ్ లో సినిమాలు ఫ్రీ గా ఉంటాయి కాబట్టి నార్త్ ఆడియన్స్ చూస్తారు. అలా అని వారు డబ్బులు పెట్టి థియేటర్స్ కి వెళ్లి బెల్లంకొండ సినిమాలు చూస్తారా అంటే అనుమానమే. ముందు టాలీవుడ్ లో సరైన హిట్ కొట్టి బాలీవుడ్ వంటి పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటే ఆయనకే మంచిది.



