బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే ఎక్కడో దూరంగా ఉన్న రాష్ట్రాలలో తుఫాను వచ్చినట్లు, ఎక్కడో బీహార్‌లో రాజకీయాలలో ప్రకంపనలు వస్తే ఆ ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా కనబడనుంది.
ఎన్డీయే కూటమి నుంచి ఇప్పటికే అకాలీదళ్, శివసేనలు తప్పుకొన్నాయి. తాజాగా బీహార్‌లోని జేడీయు కూడా తప్పుకొంది.
బిజెపితో కలిసి బీహార్‌లో సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న నితీశ్ కుమార్, హటాత్తుగా బిజెపికి ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పేసి, బద్ద విరోధి అయిన లాలూ ప్రసాద్ కొడుకు తేజస్వీ యాదవ్ (ఆర్‌జేడీ)తో చేతులు కలిపి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటుచేసుకొన్నారు.
మూడు పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వెళ్ళిపోవడంతో రాజ్యసభలో బిజెపికి మళ్ళీ కాస్త బలం తగ్గింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఎన్డీయేలో నుంచి ఒక్కో పార్టీ బయటకు వెళ్ళిపోతుండటం బిజెపి విశ్వవసనీయత ప్రశ్నార్దకంగా మారుతుంది కూడా. కనుక ఎన్డీయే బలం పెంచుకోవడానికి బిజెపి మళ్ళీ ఇతర పార్టీలను అక్కున చేర్చుకొనేందుకు ప్రయత్నించవచ్చు.
కనుక ఈ పరిణామాలు ఏపీలో వైసీపీ, టిడిపిలకు సానుకూల అంశంగా మారనున్నాయి. ఇప్పటికే వైసీపీ మోడీ ప్రభుత్వానికి అడగకుండానే మద్దతు ఇస్తోంది. కనుక బిజెపి-వైసీపీలు మరింత దగ్గర కావచ్చు. ప్రస్తుతం టిడిపికి ఎక్కువ మంది ఎంపీలు లేనప్పటికీ, ఏపీలో నానాటికీ పరిస్థితులు దిగజారుతున్నందున మళ్ళీ టిడిపితో జత కట్టాలని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు భావిస్తే టిడిపి లబ్ది పొందుతుంది.
బీహార్ రాజకీయ పరిణామాలు తెలంగాణ సిఎం కేసీఆర్‌కు కూడా ఎంతగానో ఉపయోగపడవచ్చు. సిఎం కేసీఆర్ నిత్యం ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరుగుతూ, మోడీని గద్దె దించడానికి జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. కనుక ఆయన తన లక్ష్య సాధనలో ఇప్పుడు నితీశ్ కుమార్ రూపంలో మరో బలమైన మిత్రుడు దొరికాడు. కనుక ఆయనతో చేతులు కలపవచ్చు లేదా నితీశ్ కుమారే కేసీఆర్‌తో చేతులు కలపవచ్చు.
వారిద్దరికీ యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, మమతా బెనర్జీ, హేమంత్ సొరేన్ వంటివారు తోడుగా నిలిచేందుకు సిద్దంగా ఉన్నారు. కనుక బీహార్‌లోని తాజా రాజకీయ పరిణామాలు సిఎం కేసీఆర్‌కు కూడా ఎంతగానో ఉపయోగపడవచ్చు. ఇదేవిదంగా ఇతర రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు కూడా ఎంతో కొంత ఉపయోగపడవచ్చు.



