కేంద్ర ఎన్నికల కమీషన్ బీహార్ శాసనసభ ఎన్నికలకు సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఎన్నికలను ‘మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్’ అని సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ అన్న మాట అక్షరాల నిజం. ముందుగా షెడ్యూల్ గురించి చెప్పుకున్నాకనే… దాని గురించి చెప్పుకుందాం.
బీహార్‌లో మొత్తం 243 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వీటికి అక్టోబర్ 6, నవంబర్ 11న రెండు విడతలలో పోలింగ్ జరుగుతుంది. మొదటి విడతలో 121, రెండో విడతలో మిగిలిన 122 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించి నవంబర్ 14న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
నితీష్ కుమార్ జేడీ (యు) ఎప్పటికప్పుడు రాజకీయా వ్యూహాలు మార్చుకుంటూ గత 20 ఏళ్ళలో 10 సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టగా, మోడీ 2014 నుంచి ఇప్పటి వరకు వరుసగా మూడుసార్లు ప్రధాన మంత్రి పదవి చేపట్టారు. కనుక సహజంగా ప్రజలు మార్పు కోరుకోవచ్చు.
ఇక లాలూ ప్రసాద్ రాజకీయ పతనం తర్వాత ఆర్‌జే (డి)ని ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ నడిపిస్తున్నారు. కానీ సొంతంగా అధికారంలో రాలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో, ఇటు కీలకమైన యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలలో చాలా ఏళ్ళుగా అధికారంలోకి రాలేకపోతోంది. కనుక కాంగ్రెస్-ఆర్‌జే (డి)లు పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నాయి.
దేశంలో కాంగ్రెస్, బీజేపిలతో అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహ నిపుణుడుగా పనిచేసి గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ‘జన్ సూరజ్’ అనే సొంత పార్టీతో ఈ ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేకపోతే అంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదు. జన్ సూరజ్ గెలిచినా ఓడినా ఓట్లు చీల్చి కాంగ్రెస్, బీజేపి కూటములకు తీవ్ర నష్టం చేయగలదు.
రాజకీయ పార్టీలు ఏళ్ళ తరబడి ప్రతిపక్షంలో ఉంటే ఆ పార్టీల నేతలు రాజకీయంగా, ఆర్ధికంగా బలహీనపడతారు. వేరే పార్టీలలోకి వెళ్ళిపోతుంటారు. కనుక ఈ ఎన్నికలలో గెలవడం ఈ 5 పార్టీలకు ఇవి జీవన్మరణ సమస్యవంటివే.
ఈ ఎన్నికల ప్రభావం కేవలం బీహార్ రాజకీయాలకు మాత్రమే పరిమితం కావు. అన్ని రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి. లోక్‌సభ, రాజ్యసభలో బలాబలాలు మార్చగలవు. ముఖ్యంగా ఈ ఎన్నికలు బీజేపి, కాంగ్రెస్‌లపై ఎక్కువ ప్రభావం చూపుతాయి.
పైగా కత్తులు, తుపాకుల సంస్కృతి ఉన్న బీహార్ వంటి రాష్ట్రంలో ఇన్ని ఒత్తిళ్ళ మద్య సజావుగా ఎన్నికలు నిర్వహించడం ఈసీకి నిజంగా కత్తి మీద సాము వంటిదే. అందుకే వీటిని మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ అని ఈసీ అభివర్ణించింది.




