ఈసారి వైసీపీ చేతికి మట్టి అంటకుండానే.. చిచ్చు రగిలింది!

Pawan Kalyan addressing political criticism during a Jana Sena Party meeting

టీడీపి-జనసేనల మద్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అలాగే వారికి వ్యతిరేకంగా కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఈసారి వైసీపీకి ఆ శ్రమ లేకుండా డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ స్వయంగా కాపు నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.

“మీరు చెప్పిన వారికి 2019లో టికెట్స్ ఇస్తే గెలిపించుకోగలిగారా? రెండు చోట్ల పోటీ చేసిన నన్ను కనీసం ఒక్క చోట అయినా గెలిపించారా? ఓటమి తర్వాత అందరూ నన్ను వదిలేసిపోయారు. కానీ నన్ను నమ్మి నా వెంట నడిచిన వారికి పదవులు దక్కాయి. ఒకవేళ మీరూ నన్ను వదిలేసి పారిపోకుండా ఉండి ఉంటే నేడు మీకు పదవులు దక్కేవి కదా? నాడు నన్ను వద్దనుకొని వెళ్ళిపోయినవారు ఇప్పుడు పనిగట్టుకొని విమర్శిస్తున్నారు.

ADVERTISEMENT

నేను ఏం చేసినా తప్పే.. ఏం మాట్లాడినా తప్పే… చివరికి నేను గెడ్డం పెంచుకున్నా తీసేసినా తప్పే. నా పక్కన ఎవరున్నా మీకు తప్పుగానే కనిపిస్తుంది. చివరికి నా పక్కన కాపు సామాజికవర్గానికి చెందిన నేతలున్నా మీకు అభ్యంతరమే!

అంటే మీకు నచ్చినట్లు నేను జీవించాలా? మీరు చెప్పినట్లే నేను రాజకీయాలు చేయాలా? రాజకీయాలపై మీకు అంత పట్టు, మీ బలంపై మీకు అంత నమ్మకం ఉంటే ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్ధిని మీరే ప్రకటించండి. గెలిపించుకోండి. అప్పుడు నేను కూడా మిమ్మల్ని అభినందిస్తాను.

నేను కులమతాలు చూడను. నేను కేవలం కాపుల ప్రతినిధిగా మీ ముందుకు రాలేదు. కులాల ఐఖ్యత కోరుకుంటాననని మొదటే చెప్పాను కదా?

నా ఈ భావజాలం నచ్చి నాతో కలిసి నడవాలనుకున్నవారు ఏ కులం, మతానికి చెందిన వారినైనా నేను గౌరవిస్తాను. సమాన ప్రాధాన్యం ఇస్తాను. నేటికీ నేను ఈ విధానానికే కట్టుబడి ఉన్నాను. ఇక ముందు కూడా ఇలాగే ఉంటాను.

నేను 12 ఏళ్ళపాటు చాలా ఓపికగా అన్నీ భరించాను. అందరి మాటలు విన్నాను. కానీ ఎన్నడూ ఎవరికీ జవాబీయలేదు. కానీ ఇకపై మౌనంగా ఉండదలచుకోలేదు. నా జోలికి, నా పార్టీ జోలికి వస్తే తప్పకుండా మాటకు మాట ఉంటుంది,” అని జనసేనాని స్పష్టంగా చెప్పారు.

పవన్ కళ్యాణ్‌ మాట్లాడిన ఈ మాటలు కాపు సామాజిక వర్గంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆయనని వ్యతిరేకిస్తున్న దాసరి రాము వంటివారు అప్పుడే ఎదురుదాడి కూడా మొదలుపెట్టేశారు.

ఒకవేళ జనసేన కూడా వారిపై కత్తులు దూస్తే చాలు వైసీపీ చేతికి మట్టి అంటకుండా కాపు సామజికవర్గంలో చిచ్చు మొదలవుతుంది. పేర్ని నాని, అంబటి రాంబాబు వంటివారితో ఆ కార్చిచ్చుని రగిలిస్తూ, దానిలో కూటమిని దహింపజేసేందుకు ప్రయత్నించకుండా ఉండదు.

పవన్ కళ్యాణ్‌ మనసులో ఆవేదన ఈవిధంగా బయటపెట్టుకున్నారని అర్ధమవుతూనే ఉంది. కానీ ఇది కూటమి వ్యతిరేక శక్తులను ఏకం చేసి వారి చేతికి బలమైన ఆయుధాలు అందించినట్లే భావించవచ్చు. కనుక ఇక్కడితో ఇది ముగిస్తే కూటమికి మంచిది.

ADVERTISEMENT
Latest Stories