వైసీపీ వద్దు… పవన్‌ కళ్యాణ్‌ ముద్దు! బిజెపి వ్యూహం ఏమిటో?

Daggubati-Purandeswari-Pawan-Kalyan-Jaganఏపీలో బిజెపి, జనసేనలు కలిసున్నామని చెప్పుకొంటాయి తప్ప ఏనాడూ కలిసి పనిచేయలేదు. ఇందుకు జనసేనను నిందించలేము. తాము బిజెపితో కలిసి పనిచేసేందుకు సిద్దమని చెప్పినప్పటికీ ఏపీ బిజెపి పట్టించుకోలేదని పవన్‌ కళ్యాణ్‌ బహిరంగంగానే చెప్పారు. ఏపీ బిజెపి నేతలు తమ అధిష్టానం ఆదేశం ప్రకారమే పనిచేస్తుంటారు కనుక వారినీ తప్పు పట్టలేము.

ADVERTISEMENT

బిజెపి అధిష్టానం ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేన కంటే వైసీపీకే మొదటి నుంచి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు హటాత్తుగా వైసీపీ ప్రభుత్వంపై బిజెపి పెద్దలు నిప్పులు చెరిగేసి, పవన్‌ కళ్యాణ్‌ను అక్కున చేర్చుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇన్నేళ్ళుగా లేనిది ఇప్పుడు తొలిసారిగా పవన్‌ కళ్యాణ్‌ని ఎన్డీయే సమావేశానికి కూడా ఆహ్వానించింది.

జాతీయస్థాయిలో రాజకీయ అవసరాల కోసం బిజెపి ఏర్పాటు చేసుకొన్న కూటమే ఎన్డీయే. కనుక నేడు ఢిల్లీలో జరుగుతున్న ఆ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం కూడా కేంద్రంలో మళ్ళీ మరోసారి బిజెపిని ఎలా అధికారంలోకి తీసుకురావాలనే తప్ప రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితుల గురించి చర్చించడానికి కాదు.

ఈవిషయం పవన్‌ కళ్యాణ్‌కి కూడా బాగా తెలుసు. అయితే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే తప్పనిసరిగా శక్తివంతమైన కేంద్రం సహాయసహకారాలు చాలా అవసరం. కనుక బిజెపి పెద్దల ఆహ్వానాన్ని గౌరవిస్తూ ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళారు. బిజెపి అధిష్టానానికి కూడా పవన్‌ కళ్యాణ్‌ తమ నుంచి ఏమి ఆశిస్తున్నారో బాగా తెలుసు.

కానీ బిజెపి అధిష్టానం తొలి ప్రాధాన్యం కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడమే కానీ ఏపీలో బిజెపి లేదా జనసేననో ఉద్దరించడం లేదా ఏపీని ఉద్దరించడం కానేకాదు.

కనుక ఏపీలో ఏ పార్టీ గెలిస్తే లోక్‌సభ ఎన్నికల తర్వాత తమకు అవసరమైతే ఎక్కువ ఉపయోగపడుతుందో బిజెపి అధిష్టానం లెక్కలు వేసుకొనే ఉంటుంది.

కనుక జనసేనకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్లు భ్రమింపజేస్తూనే వైసీపీ కోరుకొంటున్నట్లుగా టిడిపిని దూరంగా ఉంచుతూ జనసేనతో కలిసి బిజెపి ఏపీ శాసనసభ ఎన్నికలకు వెళ్ళవచ్చు. పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అవ్వాలని ఆరాటపడుతున్నారు కనుక ఆయననే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బిజెపి కూడా ప్రకటించవచ్చు.

దాంతో ఆయన టిడిపితో పొత్తుల గురించి ఆలోచించకుండా చేస్తూ, జనసేనకు బిజెపి శల్యసారధ్యం చేస్తూ ఏపీలో మళ్ళీ వైసీపీని గెలిపించడమే బిజెపి అధిష్టానం వ్యూహంగా కనిపిస్తోంది.

ఎందుకంటే టిడిపి, జనసేనల కంటే అప్పులు, కేసులతో బాధలు పడుతున్న జగన్ ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతలలో ఉంచుకోవడం తేలిక. కనుక బిజెపి అధిష్టానం వైసీపీకి వెనక నుంచి ఈవిదంగా కాస్త సాయపడితే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో అవలీలగా అధికారంలోకి రాగలదని భావిస్తున్నట్లుంది.

అయితే పదేళ్ళుగా రాజకీయాలలో ఉంటూ బిజెపి అధిష్టానం వైఖరిని చాలా నిశితంగా గమనిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ అంత అమాయకంగా బిజెపిని నమ్మేస్తారనుకోవడం అవివేకమే. కనుక ఆయన బిజెపి అధిష్టానంతో ఏవిదంగా వ్యవహరిస్తారనేదే చాలా కీలకం కానుంది.

ADVERTISEMENT
Latest Stories