తెలంగాణ ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడేకొద్దీ పార్టీల రంగు – రుచి – వాసనా మూడు మారిపోతున్నట్టున్నాయి.బీజేపీ – బిఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందాలు నడుస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్టుగానే నేడు బీజేపీ ఎన్నిక ప్రచారంలో ఆ పార్టీ ధర్మపురి ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ మేలని, కేసీఆర్ తెలంగాణ కోసం పదేళ్లు కొట్లాడిండు.ఆ సమయంలో రేవంత్ చంద్రబాబుకి సంచులు మోస్తూ తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసాడు. ఇప్పుడు కూడా రేవంత్ చంద్రబాబు చెప్పినట్లే ఆడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణను టీడీపీ చేతిలో పెట్టినట్టే అంటూ బీజేపీ “రంగు”ను బయట పెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ అభ్యర్థి అరవింద్.
ఎన్నికల ప్రచారం అంతిమ ఘట్టానికి చేరుకోవడంతో ఇక ఆయా పార్టీలు తమ అసలైన మిత్రులెవరో, శత్రువులెవరో, ఎవరి గెలుపు కోసం కృషి చేస్తుందో, ఎవరి ఓటమి కోసం ఆరాటపడుతుందో ప్రజలకు “తొక్క తీసి పండు నోట్లో పెట్టిన” చందంగా వివరించింది బీజేపీ పార్టీ. నిన్నటి వరకు బీజేపీ లో ముఖ్య నేతలైన బండి సంజయ్ లాంటి వారు చంద్రబాబు పై అనుకూలంగా ప్రకటనలు చేస్తూ టీడీపీ మద్దతు దారుల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకొని ఏపీలో పొత్తులో ఉన్న టీడీపీ – జనసేన కూటమి మద్దతుదారులను తమ వైపు తిప్పుకోవాలని ఆశపడిన బీజేపీ పార్టీకి తెలంగాణలో నిరాశే ఎదురయినట్టుంది. ఇక ప్రచారం చివరి దశకు చేరేటప్పటికి టీడీపీ పార్టీ పైన తమ వక్ర బుద్దిని బయటపెట్టారు బీజేపీ నేతలు.అవసరం తీరాక తెప్ప తగలేసే చందంగా బీజేపీ వైఖరి గతంలోనే ఏపీ ప్రజలు “రుచి” చూసారు.
ముందు నుంచి ఏపీలో వైసీపీ పార్టీతో అనధికార పొత్తులు పెట్టుకుని అటు పొత్తులో ఉన్న జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ను మోసం చేస్తూ ఇటు టీడీపీ పార్టీని దెబ్బకొట్టాలని చూస్తున్న బీజేపీ అవకాశం చిక్కినప్పుడల్లా టీడీపీ పై విషం జిమ్ముతూనే ఉంటుందని అరవింద్ వ్యాఖ్యలు మరోసారో రుజువు చేశాయి.తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ గెలుపుకి ఆంధ్రాలో జగన్ అరాచకానికి బీజేపీ మద్దతిస్తూ తమ కమలం “వాసన”ను రెండు తెలుగు రాష్ట్రాలలో విరజిమ్ముతున్నారు బీజేపీ పెద్దలు.
ఉదయం తెలంగాణ ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న పవన్ 2024 ఏపీలో జరిగే ఎన్నికలలో టీడీపీ – జనసేన ఉమ్మడి భాగస్వామ్యంలో గెలిచిన అన్ని ఎంపీ స్థానాలతో బీజేపీకి మద్దతుగా నిలిచి కేంద్రంలో మరో సారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం అంటూ బీజేపీకి టీడీపీ, జనసేనల మద్దతు ఉంటుందంటూ టీడీపీ పార్టీ అనుమతి లేకుండానే తొందరపాటు ప్రకటనలు చేశారు. ఇప్పుడు బీజేపీ పార్టీ నేతల వ్యాఖ్యలకు నేడు ఏపీలో ఎదురయ్యే సమస్యలను పవన్ అంచనా వేయడంలో తడబడుతున్నారనే చెప్పాలి.
ఇప్పుడేమో బీజేపీ పార్టీ నేతలు టీడీపీ పార్టీ ఆంధ్రా పార్టీ అని రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని రేవంత్ కంటే కేసీఆర్ మేలంటూ కాంగ్రెస్ టీడీపీ పార్టీల పై తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు.ఇక ఈ వ్యాక్యలతో తెలంగాణ ప్రజలకు కూడా తమ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలైన రాజకీయ చదరంగం ఏమిటో అర్ధం అవుతుందనుకుంటా.




