మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో మొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు సభలో నలుపు రంగు దుస్తులు, బురఖాలు వేసుకువచ్చిన మహిళలను పోలీసులు వెనక్కు తిప్పి పంపించేయడంతో వారు షాక్ అయ్యారు. ముస్లిం మహిళలు నల్లరంగు బురఖాలను ధరిస్తుంటారు. రొంపిచర్లలో ఓ ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ టీచరుగా పనిచేస్తున్న ఓ ముస్లిం మహిళకు ఇదే చేదు అనుభవం ఎదురవడంతో ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభకు తీసుకు రాబడిన మిగిలిన ముస్లిం మహిళలను కూడా సభలో పాల్గొనేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో అందరూ తిట్టుకొంటూ వెనుతిరిగారు.
దీనిపై టిడిపి యువనేత నారా లోకేష్ స్పందిస్తూ, “ముఖ్యమంత్రికి ఓట్లు వేసిన ప్రజలని చూస్తే భయం. ప్రజలు వేసుకున్న దుస్తులు చూస్తే భయం. నలుపు రంగు కనిపిస్తే భయం. చివరికి మైనారిటీ మహిళలు వేసుకున్న బురఖా చూసినా వణికిపోతున్నాడు. చిత్తూరు జిల్లా నగరి సీఎం పర్యటనలో నలుపు దుస్తులు, బురఖాలతో వచ్చిన మహిళలని సభాప్రాంగణం బయటే ఆపేయడం వారిని అవమానించడమే. మహిళలు, మైనారిటీలకి సీఎం క్షమాపణ చెప్పాలి,” అంటూ ట్వీట్ చేశారు.
సాధారణంగా నిరసనలు తెలియజేసేందుకు నల్ల జండాలు, నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్లు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ సభకు వచ్చేవారెవరూ నిరసనలు తెలిపేందుకు రాలేదు. పైగా వారిని వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైసీపీ కార్యకర్తలు ఒత్తిడి చేసి బలవంతంగా తీసుకువచ్చారు. ఆ వచ్చినవారు కూడా జగన్ ప్రసంగిస్తుండగానే మద్యలో లేచి వెళిపోతుంటారు. మిగిలిన వారిని పోలీసులు ఈ వంకతో తిప్పి పంపించేస్తున్నారు!
జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరితే దారిపొడవునా జనాలు కనబడకుండా పరదాలు కడతుంటారు. రోడ్డు పక్కన పచ్చటి చెట్లపై శత్రువులు నక్కి దాడి చేస్తారేమో అనే అనుమానంతో వాటినీ నిర్ధాక్షిణ్యంగా నరికేస్తుంటారు. దారిలో ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతాయనుకొంటే రెండు కిమీ దూరానికి కూడా హెలికాఫ్టర్‌లో ఆకాశమార్గాన్న ప్రయాణిస్తుంటారు. చివరికి నల్ల దుస్తులు చూసినా భయపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత అభద్రతాభావమా? మరి రాష్ట్రంలో 97 శాతం ప్రజలు తనవైపే ఉన్నారని గర్వంగా చెప్పుకొంటారు కదా?
అయినా నల్ల దుస్తులు ధరించినవారిని జగన్ సభలకు అనుమతించకూడదనే సలహా లేదా నిర్ణయం ఎవరిదో తెలియదు కానీ దానిని గుడ్డిగా అమలుచేస్తూ ఇలా నవ్వులపాలవుతున్నారు. అసలు ఈ ఆలోచనే వెర్రిగా ఉంది.
అందరూ నా అక్క చెల్లెమ్మలే… మీ పిల్లలకి నేను మేనమావనని జగన్ పదేపదే చెప్పుకొంటారు. మరో పక్క బలవంతంగా సభకు తీసుకువచ్చిన మహిళలను నల్ల దుస్తులు ధరించారని వెనక్కు తిప్పిపంపిస్తూ అవమానిస్తుంటారు! ఈవిదంగా వ్యవహరిస్తూ జగన్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం మహిళలకు ఎటువంటి సంకేతం పంపుతున్నారు?ఇంతకీ ఈ సలహా ఇచ్చింది ఎవరు?



